30-08-2025 01:14:57 AM
టోక్యో, ఆగస్టు 29: జపాన్‌లో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం భారత్-జపాన్ సంయుక్త ఆర్థిక సదస్సులో పాల్గొన్నారు. ప్రస్తు తం ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మనదే అని, ప్రపంచ దేశాలు భారత వృద్ధిని గమనించడమే కాకుండా భారత్‌పై ఆశలు పెట్టుకున్నాయని పేర్కొ న్నారు. ప్రధాని పర్యటనలో భాగంగా రెండు దేశాల మధ్య 13 ఒప్పందాలు ఖరారయ్యాయి.
దాదాపు ఏడు సంవత్సరాల అనంతరం మోదీ జపాన్‌లో పర్యటిస్తున్నారు. ‘నమస్తే కొన్నిచివా జపాన్’ అంటూ జపనీస్‌లో ప్రసంగం మొదలుపెట్టిన మోదీ సుదీర్ఘంగా ప్ర సంగించారు. ‘ప్రపంచ దేశాలు భారత్‌ను గమనించడం మాత్రమే కాదు. భారత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. భారత అభివృద్ధి పయనంలో జపాన్ ఎప్పుడూ ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. మెట్రో రైళ్ల నుంచి తయారీ వరకు.. సెమీకండక్టర్ల నుంచి స్టార్టప్స్ వరకు జపాన్‌కు చెందిన కంపెనీలు భారత్‌లో 40 బిలియన్ అమెరికన్ డాలర్ల కంటే ఎక్కువ మొత్తం పెట్టుబడులుగా పెట్టాయి.
ప్రస్తుతం భారత్‌లో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిర త్వం, విధానాల రూపకల్పనలో పారదర్శకత ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థ మనదే. అతి త్వరలో ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించబోతుంది. రక్షణ, అంతరిక్ష వ్యవస్థల తర్వాత అణుశక్తి రంగంలో కూడా ప్రైవేట్ పెట్టుబడులు ఆహ్వానిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
జపాన్ టెక్నాలజీ-భారత టాలెంట్ అన్‌స్టాపబుల్ కాంబినేషన్
జపాన్ ప్రధాని షిగురు ఇషిబాతో కలిసి ప్రధాని మోదీ సంయుక్త విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ‘భారత్-జపాన్ భాగస్వామ్యం ప్రపంచశాంతి, స్థిరత్వానికి ఎంతో అవసరం. ఈ రోజు బంగారు శకానికి పునాది వేశాం. రాబోయే పదేండ్లు ఇండియా-జపాన్ సహకారానికి రోడ్ మ్యాప్ వేశాం. జపాన్ టెక్నాలజీ, ఇండియన్ టా లెంట్ విన్నింగ్ కాంబినేషన్.
ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు రెం డు దేశాలు కలిసి ప్రయత్నిస్తున్నాయి. బలమైన ప్రజాస్వామ్య దేశాలు మరింత మెరుగైన ప్రపం చం కోసం కృషి చేస్తున్నాయి. పెట్టుబడి, ఆవిష్కరణ, ఆర్థిక భద్రత, పర్యావరణం, సాంకేతికత, ఆరోగ్యం, మొబిలిటీ, ప్రజల మధ్య మార్పిడి, రాష్ట్రాల సహకారం భారత దార్శనికతకు ఉదాహరణ’ అని తెలిపారు.
రాజస్థానీ వేషధారణలో స్వాగతం
జపాన్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి జపాన్ మహిళలు గాయత్రీ మంత్రం చదువుతూ రాజస్థానీ వేషధారణలో స్వాగతం పలికారు. జపాన్ కళాకారులు సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ప్రధానికి బోస్ కుమార్తె విజ్ఞప్తి
జపాన్ పర్యటనలో ప్రధాని మోదీని సుభాష్ చంద్రబోస్ కుమార్తె అనితా బోస్ కలిశారు. అం తకు ముందు అనితా బోస్ మీడియాతో మాట్లాడారు. ‘మోదీతో మాట్లాడే అవకాశం వస్తే నా తం డ్రి అస్థికలను భారత్‌కు తరలించాలని కచ్చితంగా విజ్ఞప్తి చేస్తా. నాకు ఇప్పుడు 82 ఏండ్లు. వయసు మీద పడుతున్న దృష్ట్యా నాకు ఇది చాలా అవస రం’ అని భావోద్వేగంతో పేర్కొన్నారు.
చంద్రయాన్‌కు జపాన్ సహకారం
భారత్-జపాన్ సంయుక్త ఆర్థిక సదస్సు సందర్భంగా ఇరు దేశాల నడుమ 13 ఒప్పందాలు కుదిరాయి. వచ్చే 10 సంవత్సరాల్లో జపాన్ కంపెనీలు 10 ట్రిలియన్ యెన్ మేర భారత్‌లో పెట్టుబడి పెట్టాలని ఇరుదేశాధినేతలు లక్ష్యంగా పెట్టుకున్నారు. భారత్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్ మిషన్‌కు జపాన్ అంతరిక్ష సంస్థ (జాక్సా) సహకారం అందించనుంది.
చంద్రయాన్-5 కోసం భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)-జాక్సా పరస్పర సహకారం అందించుకోవాలని ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇక ఇండియా-జపాన్ డిజిటల్ పార్ట్‌నర్‌షిప్ 2.oను కూడా ప్రకటించారు. కృతిమమేధ, సెమీకండక్టర్స్, డిజిటల్ పబ్లిక్ మౌలిక వసతుల కల్పనలో ఈ రెండు దేశాలు కలిసి పని చేయనున్నాయి. అరుదుగా దొరికే ఖనిజాల వెలికితీతపై రెండు దేశాలు దృష్టిసారించాయి.
ఖనిజాల వెలికితీత, ప్రాసెసింగ్ సాంకేతికతలను ఒకరితో ఒకరు పంచుకునేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇవి మాత్రమే కాకుండా రాబోయే పదేళ్ల కాలానికి జాయింట్ విజన్, రక్షణలో సహకారంపై జాయింట్ డిక్లరేషన్, జపాన్ మానవ వనరుల బదిలీ, క్లీన్ హైడ్రోజన్ అండ్ అమ్మోనియా కో ఆపరేషన్, పర్యావరణ మార్పులు, జీవవైవిధ్య రక్షణ, సంస్కృతి రక్షణ, మురుగు నీటి నిర్వహణ ఒప్పందాలపై సంతకాలు చేశాయి.