calender_icon.png 15 August, 2025 | 12:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద సహాయక చర్యలు వేగంగా అమలు చేయాలి

15-08-2025 12:51:54 AM

కలెక్టర్లకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి ఆదేశం 

నిర్మల్, ఆగస్టు 14 (విజయక్రాంతి): ముఖ్యమంత్రి సూచనల మేరకు రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై, రెవెన్యూ, హౌసిం గ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గురువారం సచివాలయం నుండి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తో పాటు చీఫ్ సెక్రటరీ రామకృష్ణ రావు, వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, భారీ వర్షాల నేపధ్యంలో తీసుకోవలసిన సహాయక చర్యల కోసం ప్రతి జిల్లాకు కోటి రూపాయిలు విడుదల చేశామని అవసరమైతే మరిన్ని నిధు లు విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నామని తెలిపారు. సహాయక చర్యలు పర్యవేక్షించేందుకుగాను ఉమ్మడి పది జిల్లాలకు సీనియర్ అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని తెలిపారు.

ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముంద స్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. సెలవులో ఉన్న అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి విధుల్లో హాజరుకావాలని సూచించారు. రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, జనజీవ నానికి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్రంలోని వివిధ జిల్లా ల్లో వర్షాల ప్రభావం, లోతట్టు ప్రాంతాల పరిస్థితి, వరద ముప్పు ఉన్న ప్రదేశాలపై కలెక్టర్ల నుండి సమాచారం సేకరించారు. అవసరమైన రక్షణ చర్యలు, సహాయక బృందాల మోహరింపు, కంట్రోల్ రూమ్ల ఏర్పాటు వంటి అంశాలపై మంత్రి సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ మాట్లాడుతూ, జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం వల్ల ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

కడెం ప్రాజెక్టు ఇన్ఫ్లో, అవుట్ఫ్లో స్థితిని ఇరిగేషన్ శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, నీటి మట్టం పెరిగిన సందర్భంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని చెప్పారు. లోతట్టు ప్రాంతా లు, వరద ముప్పు ఉన్న గ్రామాల వారీగా తహసీల్దార్లు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బందిని అప్రమత్తంగా ఉండమని ఆదేశించామని తెలిపారు. అలాగే వైద్య సిబ్బం ది నిరంతరం అప్రమత్తంగా ఉండి, అవసరమైన చోట్ల వెంటనే మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి, వర్షాల వల్ల ప్రభావితమైన ప్రజలకు తగిన వైద్య సేవలు అందించాల్సిందిగా ఆదేశించామని తెలిపారు.

ఈనెల 15 నుండి 21 వరకు బ్లడ్ డొనేషన్ క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. అత్యవసర పరిస్థితులు, తక్షణ సహాయం కోసం కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ను 24 గంటలు పనిచేసే విధంగా ఏర్పాటు చేశామని, ప్రజలు 9100577132 ద్వారా సమాచారాన్ని అందించవచ్చని పేర్కొన్నారు. రహదారులు, వంతెనల వద్ద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ, అవసరమైతే వాహన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఎస్పీ జానకి షర్మిల, అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్, కిషోర్ కుమార్, బైంసా సబ్ కలెక్టర్ సంకేత్ కుమార్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.