calender_icon.png 6 November, 2025 | 2:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జాలతోనే వరద ముప్పు

06-11-2025 12:00:00 AM

-కందనూలు జిల్లాలో వరుసగా భారీ వర్షాలు

-కుంట కట్టల ధ్వంసం,  నాళాల కబ్జా పాపం ఎవరిది..?

-ముంపు బాధలు మరొకరికి.

-అయినా చలించని అధికార యంత్రాంగం

 నాగర్ కర్నూల్ నవంబర్ 5 (విజయక్రాంతి) : నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా మారడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు, రాజకీయ పరపతి కలిగిన ఖద్దర్ చొక్కా లీడర్లు ప్రభుత్వ భూములు, కుంటలు, ప్రధాన నాళాలపై అమాంతం వాలిపోయారు. వర్షపు నీరు చెరువులు, కుంటాల్లోకి వెళ్లేందుకు అనుకూలంగా ఉన్న సహజ సిద్ధంగా ఏర్పడిన కాలువలు,  నాళాలను కబ్జా చేసి విలాసవంతమైన భవనాలతో పాటు తాత్కాలిక షెడ్లు ఇతర బిల్డింగులు ఏర్పాటు చేసుకున్నారు. వాటిపై నిర్మాణాలు చేపడుతున్న క్రమంలోనూ సంబంధిత మున్సిపల్ అధికారులు ముడుపులకు కక్కుర్తి పడి అడ్డగోలుగా అనుమతులు కూడా ఇచ్చేశారు.

భూ రికార్డుల్లో పేర్లు ఉన్నప్పటికీ సహజసిద్ధంగా వర్షపు నీరు ప్రవహించే నాళాలు కాలువలను ధ్వంసం చేయడంతోనే ముంపు సమస్య వాటిల్లుతోంది.  తీరా స్థానికుల నుంచి ఫిర్యాదులు అందినా తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో అమాయక ప్రజలు ఇళ్లల్లోకి చేరిన మురుగు నీటితో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. నాగర్ కర్నూల్ మేజర్ గ్రామపంచాయతీ ఉన్న సమయంలో సమీప గ్రామపంచాయతీలైన ఉయ్యాలవాడ, నెల్లికొండ, నాగనూల్, ఎండబెట్ల, చందాయిపల్లి వంటి రెవెన్యూ గ్రామాల్లో వర్షపు నీటిని సంరక్షించడం కోసం కుంటలు ఉండేవి.

కానీ ప్రత్యేక రాష్ట్రం అనంతరం నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంగా రూపాంతరం చెందిన వెంటనే బిఆర్‌ఎస్ పార్టీలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులు, భూ కబ్జాదారులు, కద్దర్ చొక్కా లీడర్లు కుంటలన్నింటినీ కబ్జా చేసి వెంచర్లుగా మార్చి కోట్లు కొల్లగొట్టారు. దాంతోపాటు పాలెం గ్రామం నుండి మొదలుకొని నాగర్ కర్నూల్ పట్టణ నడిబొడ్డు మీదుగా నాగర్ కర్నూల్ నూతన కలెక్టరేట్ భవనం వరకు ప్రభుత్వ జాగలన్నీ కబ్జా చేశారు. నాగనూల్, నెల్లికొండ, ఉయ్యాలవాడ, ఎండబెట్ల గ్రామ పరిధిలోని కుంటకట్టలన్నిటిని ధ్వంసం చేసి అందులో వర్షపు నీరు నిలవకుండా వరద కాలువలను నాళాలను ఖతం చేశారు.

వాటి ఫలితంగానే నేడు కురిసిన భారీ వర్షాలకు వర్షపు నీరంతా రోడ్లపైనే చేరి ప్రజా రవాణాకు తీవ్ర ఆటంకం ఏర్పడుతుంది. మంగళ బుధ వారాల్లో రెండు రోజులు కురిసిన భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని ఉయ్యాలవాడ గ్రామ శివారు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు సుమారు మూడు గంటల పాటు ట్రాఫిక్ జామ్ అయి ప్రయాణికులు నరకయాతన అనుభవించారు. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న భారీ నాళాల పైన కబ్జాలు చేసి కమర్షియల్ బిల్డింగ్స్, ప్రైవేటు షెడ్యూలు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ భవనాల నుండి తరచూ మున్సిపల్ అధికారులు ముడుపులు అందుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. 

 కుంటలను ధ్వంసం చేయడం వల్లే ప్రధాన రహదారులు జలమయం. 

ఉయ్యాలవాడ ఊరకుంటతో పాటు పాత ఆర్టీవో కార్యాలయం సమీపంలోని కుంట, ప్రైవేటు ఫంక్షన్ హాల్ పరిధిలోని మరో రెండు కుంటలు, నాగనూలు గ్రామ శివారులోని పుట్నాలకుంట, సద్దల్ సాబ్ కుంట, నెల్లికొండ గ్రామ శివారులోని మరో రెండు కుంటలు పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపారుల చేతిలో ధ్వంసమయ్యాయి. వీటి పైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు కూడా అందినప్పటికీ రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రియల్ వ్యాపారుల పై నేటికి చర్యలు తీసుకోలేదని చర్చ జరుగుతోంది. దీంతో ప్రధాన రహదారి వెంట మోకాళ్ళ లోతు నీరు చేరి సమీప సామాన్యుల ఇళ్లల్లోకి వర్షపు నీరు మురుగునీరు చేరుతుంది. 

నాలాల కబ్జా అంశంలో పరిశీలిస్తున్నాం.

ప్రధాన రహదారి వెంట వర్షపు నీరు చేరడానికి అసలైన కారణాలను గుర్తించడం వాటి నివారణ కోసం ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ సంయుక్త శాఖల సహకారంతో రికార్డులు పరిశీలించి శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపడతాం. 

 - నాగిరెడ్డి, మున్సిపల్ కమిషనర్, నాగర్ కర్నూల్.