06-11-2025 12:00:00 AM
-భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయ ప్రాంగణాలు
-తుంగభద్ర నదిలో పుణ్య స్థానాలు ఆచరించిన భక్తులు
అలంపూర్, నవంబర్ 5: కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రత్యేకత ఉంది.కార్తీక పౌర్ణమి రోజున జోగులాంబ దేవిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల అపార నమ్మకం. కాబట్టి శక్తిపీఠంలో కొలువైన శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వార్లను దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.బుధవారం దేవస్థాన ప్రాంగణ మొత్తం భక్తులతో కిటకిటలాడాయి.
ఆలయాల సమీపంలో ఉన్న పుష్కర ఘాట్ లో తెల్లవారుజాము నుంచి భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి, అనంతరం దీపాలు వెలిగించి నదిలో వదిలారు. కొందరు భక్తులు తుంగభద్ర నదిమా తల్లికి సారెలు పసుపు కుంకుమలు సమర్పించారు.అనంతరం బాల బ్రహ్మేశ్వర స్వామి వారిని దర్శించుకుని అభిషేకాలు నిర్వహించి తదనంతరం జోగులాంబ అమ్మవారి ఆలయంలో కుంకుమ అర్చనలు వంటి ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొన్నారు.
బారులు తీరున క్యూ లైన్లు
కార్తీక పౌర్ణమి రోజు సందర్భంగా భక్తులు దర్శనాలు, అభిషేకాల కోసం పెద్ద సంఖ్యలో బారులు తీరారు. భక్తజనసంద్రంతో ఆలయ ప్రాంగణాలు కార్తీకపౌర్ణమిను శోభను సంతరించుకున్నాయి.భక్తులు టికెట్లు కొనుగోలు చేసి క్యూలో లైన్లో గంటల తరబడి నిలుచున్నారు.అయితే ఆలయ సిబ్బంది భక్తులను పక్కన బెట్టి, వీఐపీ పేరుతో కొంత మంది వ్యక్తులను దొడ్డిదారిన లోపలికి తీసుకెళ్లి అభిషేకాలు చేయిస్తున్నారంటూ కొంత మంది భక్తులు చర్చించుకున్నారు.
అత్యంత రద్దీ గల కార్తీక పౌర్ణమి రోజయినా కూడా ఆలయ ఈవో దీప్తి అక్కడ కనిపించకపోవడం భక్తుల్లో అసంతృప్తి, స్థానికుల్లో విమర్శలకు కారణమైంది. భక్తుల సౌకర్యాలపై అజాగ్రత్తగా వ్యవహరిస్తూ, దేవస్థానం ఆదాయంటెండర్లపైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారంటూ కొంతమంది మండిపడు తున్నారు. కాగా ఆలయంలో పనిచేస్తున్న రికార్డు అసిస్టెంట్లు, పొరుగు సేవల సిబ్బంది, మరియు కంప్యూటర్ ఆపరేటర్ల కను సన్నల్లోనే దేవస్థానాన్ని నడిపిస్తున్నారని పలు విమర్శలు వినిపిస్తున్నాయి.