06-01-2026 12:30:27 AM
ఖమ్మం, జనవరి 5 (విజయ క్రాంతి): ఎవ్రీ చైల్ రీడ్స్ కార్యక్రమం అమలుపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి క్యాంప్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత మండల విద్యాశాఖ అధికారులు, హెడ్ మాస్టర్, పాఠశాల సిబ్బందితో ఎవ్రీ చైల్ రీడ్స్ రెండవ దశ కార్యక్రమ అమలుపై సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ పిల్లల పఠన సామర్థ్యం పెంపునకు జిల్లాలో వినూత్నంగా చేపట్టిన ఎవ్రీ చైల్ రీడ్స్ కార్యక్రమం మొదటి దశ మంచి ఫలితాలు అందించిందని అన్నారు.
పంచాయతీ ఎన్నికల కారణంగా ఈ కార్యక్రమం అమలులో కొంత గ్యాప్ వచ్చిందని, నూతన సంవత్సరంలో ఉపాధ్యాయులు మరింత ఉత్సాహంగా ఈసిఆర్ రెండవ దశ అమలుకు మరింతగా కృషి చేయాలని సూచించారు. మొదటి నెల ఉపాధ్యాయుల నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ మేరకు పిల్లల కోసం రెండు రకాల స్టడీ మెటీరియల్స్ సిద్దం చేశామని, వెనుకబడిన విద్యార్దులకు బేసిక్స్ మరింత బలోపేతం చేసేలా మెటీరియల్, మంచి ప్రగతి సాధించిన విద్యార్థులకు వైవిధ్యమైన పదాలతో కూడిన మెటీరియల్ తయారు చేశామని అన్నారు. ఎవ్రీ చైల్ రీడ్స్ కార్యక్రమం రెండవ విడత 45 రోజుల పాటు నిర్వహించాలని, ప్రస్తుతం మనం చేసే కార్యాచరణతో పిల్లలలో పఠన సామర్థ్యం గణనీయంగా పెరుగుతోందని ఆశించారు.
ఫిబ్రవరి నెలలో జరిగే ఎఫ్.ఎల్.ఎన్ సర్వె లో మన జిల్లా నుంచి మంచి పురోగతి వస్తుందని అన్నారు. ఎవ్రీ చైల్ రీడ్స్ కార్యక్రమం ప్రతి బుధవారం అసెస్మెంట్ తప్పనిసరిగా చేయాలని కలెక్టర్ తెలిపారు. ఖమ్మం రూరల్, సత్తుపల్లి, చింతకాని, బోనకల్ మండలాలో మంచి ఫలితాలు వస్తున్నాయని కలెక్టర్ తెలిపారు. ప్రతి విద్యార్థి చిన్న చిన్న వ్యాఖ్యలు చదివే సామర్ధ్యం కలిగి ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈసిఆర్ ప్రారంభించిన మొదటి వారం కేవలం 11 శాతం స్టూడెంట్స్ మాత్రమే వ్యాఖ్యాలు చదివే సామర్థ్యంతో ఉన్నారని , డిసెంబర్ 28 నాటికి 38 శాతానికి చేరిందని కలెక్టర్ తెలిపారు. పిల్లలకు జీవిత కాలం ఉపయోగపడే సామర్థ్యాన్ని మనం అందిస్తున్నామని తెలిపారు. అనంతరం కలెక్టర్ ఉపాధ్యాయుల నుంచి ఎవ్రీ చైల్ రీడ్స్ కార్యక్రమం అమలు ద్వారా వచ్చిన ఫలితాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి చైతన్య జైనీ, సియంఓ ప్రవీణ్ కుమార్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.