12-09-2025 12:00:00 AM
వికారాబాద్, సెప్టెంబర్ 11: ప్రజల హక్కులను కాపాడవలసిన బాధ్యత మన అందరిపై ఉందని అదేవిధంగా ఆహార భద్రతా చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ ఆహార భద్రత చట్టం-2013 అమలుపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది.
ఈ సమావేశాని రాష్ట్ర ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి,కమిషన్ సభ్యులు భారతి, శారద, ఆనంద్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని వివిధ శాఖలు ఇచ్చిన నివేదికలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహార భద్రత కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ... ఆహార భద్రత చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. హక్కుదారులకు ఎలాంటి భంగం కలగకుండా న్యాయం చేకూర్చుచే విధంగా కమిషన్ పనిచేస్తుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు బలహీన వర్గాలకు చౌక ధర దుకాణాల ద్వారా అందిస్తున్న సన్న బియ్యం తూనికల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. చౌక ధరల దుకాణాల వద్ద ఫిర్యాదుల పట్టిక, అధికారుల ఫోన్ నెంబర్లను, పనిచేసే వేళలను సూచించే విధంగా ఫ్లెక్సీలు ప్రదర్శించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలలలో, అంగన్వాడీలలో మెనూ ప్రకారం నాణ్యమైన పౌష్టిక ఆహారాన్ని అందించేందుకు చర్యలు తీసుకోవాలని అదేవిధంగా రోజువారి మెనూ పట్టికను ప్రదర్శింపజేయాలని ఆయన తెలిపారు. విద్యా, నిఘా కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. పౌష్టిక ఆహార తినే హక్కు రాజ్యాంగం కల్పించిందని, పౌష్టిక ఆహారం అందిస్తున్నారా లేదా అనే విషయాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తనిఖీలు చేపట్టాలని చైర్మన్ సూచించారు.
ప్రతి అధికారి అంకిత భావంతో పనిచేసే ఆహార భద్రతను పకడ్బద్దిగా నిర్వహించాలని ఆయన సూచించారు. బావి భారత పౌరులుగా తీర్చిదిద్దే పాఠశాలల్లో , వసతి గృహాల్లో ఆహార భద్రత చట్టంపై అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. అంగన్వాడీలలో మాతా శిశువులకు పౌష్టిక ఆహారాన్ని కచ్చితంగా అందించే విధంగా అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని కమిషన్ చైర్మన్ తెలిపారు. సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్ తదితర అధికారులు పాల్గొన్నారు.