calender_icon.png 12 September, 2025 | 9:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డబుల్ బెడ్ రూం ఇళ్లలో ఎమ్మెల్యే నాయిని పర్యటన

12-09-2025 06:48:47 PM

హనుమకొండ,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని బాలసముద్రంలో గల ఇందిరమ్మ రెండు పడకల ఇండ్ల కాలనీలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధికార యంత్రాంగంతో పర్యటించారు. కాలనీలో పర్యటించి స్థానికంగా ఉన్న కాలనీ వాసుల అందరి మధ్యలో అధికారులతో కలసి కావాల్సిన మౌలిక వసతులు, సౌకర్యాల కల్పన గురించి ఆరా తీశారు.ప్రధానంగా విద్యుత్తు,మంచి నీరు,డ్రైనేజీ వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి సారించాలని యుద్ధ ప్రాధిపతికనా  సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు.

అనంతరం స్థానిక ప్రజల సమస్యలను ఉద్దేశించి ఎమ్మెల్యే  మాట్లాడూతు అకాల వర్షాలతో ఇబ్బంది పడుతున్న బస్తీ వాసుల సమస్యలను పరిష్కరించాలని విద్యుత్,నీరు సరఫరా ఇళ్లను కేటాయించిన తరువాత ఇవ్వాలని ముందు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.పట్టాల మంజూరు తరువాత జిల్లా కలెక్టర్ ఆధ్యక్షతన ఎంపీ , నగర మేయర్,కూడా చైర్మన్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించామని ప్రాధాన్యత పరంగా తొలుత విద్యుత్ సరఫరా అందించేందుకు రూ.45 లక్షల నిధులను మంజూరు చేశామని తెలిపారు.రానున్న వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి అవగానే విద్యుత్ సరఫరా పనులను వేగవంతం చేస్తామని చెప్పారు.

గతంలో స్థానంగా ఉన్న మంచినీటి సరఫరా పైపులకు సంధానం చేసి ఇక్కడ ఉన్న సంపులు (నీటి తొట్టె)లకు సరఫరా కల్పిస్తానని తెలిపారు. కాలనీ ప్రజలను ఇబ్బంది లేకుండా చేసిందుకు ప్రభుత్వం,అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.మున్సిపాలిటీ స్వచ్ఛత విషయంలో రాజీలేకుండా కాలనీలలో చెత్త సేకరణ కుండీలను ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు.నిర్మాణం చేపట్టిన చాలా ఏళ్ల తర్వాత ప్రారంభించిన క్రమంలో చాలా వరకు డోర్స్,కిటికీలను ధ్వంసం చేసియినప్పటికీ మున్సిపాలిటీ నుంచి ప్రత్యేక చొరవతో అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.ఇళ్ల పంపిణీలో ఎటువంటి అవకతవకలు జరగలేదని కానీ ఇంకొంత మందికి ఇళ్లు రావాలని నా దృష్టికి వచ్చిందని ఆయన అన్నారు.

రానున్న రోజుల్లో ఇక్కడ అర్హత కలిగిన వారికి తప్పకుండా ఇళ్లు మంజూరు చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సొంతంగా ఇంటి స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో అర్హులుగా ఎంపిక చేస్తానని తెలిపారు. బాలసముద్రంలో ప్రస్తుతానికి ఎటువంటి ఇల్లు లేవని దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. గతంలో పలువురు దళారులు పెద్దమనుషులుగా చెలామణి చేసి చాలా మంది వద్ద డబ్బులు వసూలు చేశారని వారిని గుర్తించి తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇంకా మోసపోయిన వారు ఉంటే ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేస్తే వెంటనే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.