05-07-2025 12:00:00 AM
కృత్రిమ రంగుల వినియోగంపై నోటీస్ జారీ
కరీంనగర్, జూలై 4 (విజయ క్రాంతి): కరీంనగర్ నగరంలో మరోమారు కల్తీ ఆహార పదార్థాల వినియోగం వెలుగులోకి వచ్చింది. గతంలో పెద్ద పెద్ద హోటళ్లను తనిఖీ చేసిన సందర్భాల్లో మిగిలిన పదార్థాలు, కాలం చెల్లిన ఆహార పదార్థాల వినియోగం వెలుగులోకి వచ్చింది. వారికి నోటీసులు జరిమానా విధించినా నగరంలో ఆహార కల్తీ దందా ఆగడు లేదు.
99 రూపాయలకే బిర్యానీ అంటూ కాలం చెల్లిన పదార్థాలను వినియోగిస్తూ సొమ్ము చేసుకుంటున్న వైనం మరోమారు వెలుగులోకి వచ్చింది. శుక్రవారం పలు హోటళ్లపై తనిఖీలు చేసిన సందర్భంలో మరోమారు కల్తీ ఆహార ఉత్పత్తులు, కాలం చెల్లిన మసాలల వినియోగం వెలుగులోకి వచ్చింది. నిత్యం తనిఖీలు చేయకుండా అడపా దడపా చేస్తుండడం వల్ల ఈ దందా యధావిధిగా కొనసాగుతుంది.
కేవలం ఆహార పదార్థాలపై దృష్టి పెడుతున్న ఫుడ్ ఇన్స్పెక్టర్లపై కల్తీ నూనె వినియోగంపై దృష్టి సారించడం. లేదు. నగరంలోని రాజుగారి బిర్యానీ అడ్డా అనే రెస్టారెంట్ను ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ అంకిత్ రెడ్డి ఆధ్వర్యంలో తనిఖీ చేశారు. రెస్టారెంట్ కిచెన్ అధికారులు తనిఖీ చేయగా ఫ్రీజర్లో ముందు రోజు మిగిలిపోయిన బాయిల్డ్, వివిధ రకాల చికెన్ ఐటెమ్స్న గుర్తించారు.
17 కిలోల వరకు చికెన్తోపాటు కార్న్, వెజ్ ఐటెమ్స్న గుర్తించి పారవేశారు. అలాగే చికెన్ ఐటమ్స్ లో కృత్రిమ రంగులు వాడినట్లు గుర్తించారు. అలా రంగులు వాడటం నిబంధనలకు విరుద్ధం. మరలా కృత్రిమ రంగులు వాడవద్దని నోటీస్ ను అందజేశారు. నాన్ వెజ్ ఐటెమ్స్కు సంబంధించి ముడి పదార్థాలపై తప్పకుండా డేట్ లేబుల్ వేయాలని సూచించారు.
డేటల్ లేబుల్ లేని పదార్థాలపై ఉక్కుపాదం మోపితేకాని ఈ కల్తీ దందాకు అడ్డుకట్ట పడవు. నగరంలో పలుచోట్ల నిషేధిత ప్లాస్టిక్ కవర్లను వినియోగిస్తూ ఆహార పదార్థాలను ప్యాక్ చేస్తూ అమ్మకాల జోరు కూడా విపరీతంగా సాగుతోంది. ఆహార భద్రత శాఖ అధికారులు ఒక వారం రోజులపాటు నిరంతరంగా తనిఖీ చేసి కల్తీ దందాను కట్టడి చేయాలని వినియోగదారులుకోరుతున్నారు.