05-07-2025 06:37:26 PM
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి..
కరీంనగర్ (విజయక్రాంతి): కేంద్రంలో మూడవ సారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ పూర్తిగా రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ, రాజ్యాంగంలో నిర్దేశించుకున్న లౌకిక వ్యవస్థకు భంగం కలిగిస్తున్నాడనీ, దేశ సంపదను కొల్లగొట్టే వారికి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తున్నాడని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. శనివారం కరీంనగర్ లోని సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్(District Secretary Panjala Srinivas)తో కలిసి విలేకరుల సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడుతూ... ఆపరేషన్ కగార్ పేరుతో దుర్మార్గపు చర్యలకు పాల్పుతుందని, సమాజం కోసం, ప్రజల కోసం, సమతా రాజ్యం కోసం పోరాడుతున్న వారిని హతమార్చడం అన్యాయమన్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దులను చుట్టు ముట్టి అయితే లొంగిపోవాలి లేదా హతమారుస్తాం అనే విధంగా వ్యవహరించి వారిని హతమారుస్తూ రాజ్యాంగ ఉల్లంఘన పాల్పడుతుందని, ఒక వ్యక్తిని చంపే హక్కు మీకు ఎవరిచ్చారని, వారు శాంతి చర్చలకు సిద్ధం అన్నప్పటికీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
2027 నాటికి మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామని అమిత్ షా పదేపదే ప్రకటిస్తున్నాడని, తాత్కాలికంగా వారిని ఏరివేయవచ్చు కానీ భూ ప్రపంచం ఉన్నంత కాలం సిద్ధాంతం ఉంటుందని అన్నారు. 2007 లో అనాటి ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి మావోయిస్టులతో చర్చలు జరపారని వెంకటరెడ్డి గుర్తు చేసారు. రైతుల భూ సమస్యల పరిష్కారం కోసం గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకువచ్చిందని ఈ పోర్టల్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతాయని ఆనాడే కేసీఆర్ తో చెప్పినానని, మ్యానువల్ రిజిస్టర్ కూడా ఉండాలని చెప్పినా వినకుండా ఉన్నారని, దాని వల్ల అధికారులు విచ్చల విడిగా తప్పులు చేసి, అక్రమాలకు పాల్పడ్డారన్నారని, అటు అధికారులకు, ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వరంగా మారి కోట్లాది రూపాయలు చేతులు మారాయన్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చి రైతుల కష్టాలు తీరుస్తామని చెపుతున్నారు మాటల్లో కాదు చేతల్లో చూపాలని అన్నారు. చట్టాల్లో అనేక లొసుగులు ఉన్నాయని వాటిని ప్రక్షాళన చేయాలని, క్షేత్ర స్థాయిలో భూ సర్వే చేసి పరిష్కరించాలని అన్నారు. తెలంగాణలో మెట్ట ప్రాంతాలకు సాగు నీరందించడానికి ఎత్తిపోతలు ఏకైక మార్గమని సిపిఐ యాభై ఏళ్లకు పైగా పోరాడుతుందని అన్నారు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కు రాజశేఖర్ రెడ్డి కొంత పనిచేసినప్పటికీ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ కాళేశ్వరంకు అంకురార్పణ చేశాడని, అందులో కొంత అవినీతి జరిగిందని, పిల్లర్లు కుంగిపోయాయని అన్నారు. ఏదైనా రైతులకు సాగునీరు అందించాడని సీఎం రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ప్రత్యేకచొరవ తీసుకోవాలని ప్రభుత్వానికి వెంకటరెడ్డి సూచించారు. ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్, కార్యవర్గ, కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్, కసిరెడ్డి సురేందర్ రెడ్డి, టేకుమల్ల సమ్మయ్య, పైడిపల్లి రాజు, బ్రామండ్ల పెల్లి యుగేందర్, తదితరులు పాల్గొన్నారు.