25-05-2025 12:00:00 AM
అందానికి నిర్వచనంగా గులాబీని చెప్పడం మామూలే. మరి ఆ పూల నుంచి తీసే నూనెతో వచ్చే సౌందర్య ప్రయోజనాలేంటో తెలుసా? ఈ నేచురల్ ఎసెన్షియల్ ఆయిల్‌ని వాడటం వల్ల జుట్టు పెరగడమే కాకుండా.. చర్మాన్ని కూడా తాజాగా ఉంచుతుంది. గులాబీ నూనె ఉపయోగాలేంటో తెలుసుకుందాం..
రోజ్ ఆయిల్ పొడిబారిన చర్మాన్ని తేమగా మారుస్తుంది. దీనిలో ఉండే యాంటీ ఏజింగ్ గుణాలు ముడతలు, సన్నని గీతలు.. వంటి వాటిని తగ్గించి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. దీన్ని మాయిశ్చరైజర్‌గా వాడాలంటే చెంచా ఆలివ్ నూనెలో నాలుగైదు చుక్కల రోజ్ ఆయిల్ కలిపి స్నానానికి ముందు ముఖానికి రాస్తే సరిపోతుంది.
ఈ పూల నూనెలోని యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలను తగ్గిస్తాయి. చర్మంపై మచ్చలను నివారిస్తాయి. ముల్తానీ మట్టిలో కప్పు గులాబీనీరు, నాలుగైదు చుక్కల రోజ్ ఆయిల్ చేర్చి ముఖానికి ప్యాక్ వేస్తే మంచి ముఖం తాజాగా, కాంతివంతంగా కనిపిస్తుంది.
రోజ్ ఆయిల్‌లోని సువాసనలు ఆందోళన, డిప్రెషన్‌ని తగ్గిస్తాయి. దీన్ని అరోమాథెరపీలో వాడితే మనసుని శాంత పరుస్తుంది. డిఫ్యూజర్‌లో రెండు చుక్కల ఈ నూనెను వేస్తే సరి. లేదంటే లీటరు నీటిలో రెండు చుక్కల గులాబీ నూనె కలిపి గదిలో స్ప్రే చేస్తే మంచి పరిమళం వస్తుంది.
జుట్టు నిర్జీవంగా మారితే నాలుగైదు చుక్కల గులాబీ నూనెని కొబ్బరినూనెలో కలిపి కురులకు పట్టించాలి. గంట ఆగి ఆవిరి పట్టి తలస్నానం చేస్తే మంచి జుట్టు చిక్కులు లేకుండా మృదువుగా తయారవుతుంది. మాడు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.