10-05-2025 01:53:58 AM
భగవంతుడు మనం చేసిన కర్మలనుబట్టి ఆయా తల్లిదండ్రులను ఇవ్వడమేకాక ఆయా ప్రదేశాల్లో జన్మింపజేస్తాడు. తరచుగా మనం ప్రదేశాలను, దేశాలను మారుస్తుంటాం. అయినా కర్మ ఫలాలు మన వెన్నంటే ఉంటాయి.
పుణ్యం చేసి ఏ దేశానికి వెళ్లినా ఆ దేశంలో సుఖమే లభిస్తుంది. పాపం చేసి ఇంకో దేశం వెళ్లినా కర్మఫలం మనల్ని దుఃఖాలపాలు చేస్తుంది. మనం చేసే కర్మలకు మనమే కర్తలం కావచ్చుగాని ఫలాలకు మాత్రం మనం కామనే విషయాన్ని వేదాలతోపాటు భగవద్గీత కూడా మనకు స్పష్టం చేస్తుంది.
నేను చేసిన పూర్వ జన్మకర్మలనుబట్టి నాకెవరు తల్లిదండ్రులవుతా రో, వారి గర్భంలో నేను పుట్టాలంటే వారున్న ఊళ్లోగాని, పట్నంలోగాని ప్రభవించవలసిందే.
నేను పాలమూరు జిల్లాలోని సరిహద్దు గ్రామంలో పుట్టాను. అప్పట్లో మా ఇంటికి వెనుకనే విశ్వకర్మల ఇల్లుండేది. వారు మొద్దులను చీల్చి, రంపంతో పలకలు చేసి బాడిసతో గృహోపకరణాలు చేయడం కళ్లారా చూశాను. వారు ఆ పని చేస్తుంటే ఆ చప్పుడు నా చెవుల పడేది.
అట్లా వారు చేసే చప్పుడు ఎంత శ్రవణ పేయంగా ఉండేదో, మా అన్నయ్యలు మగ్గం నేస్తుం టే కూడా ఆ శబ్దం కూడా నా చెవులకు ఇంపుగానే ఉండేది. ఎలాగైతే మా ఇంటి వెనుక విశ్వకర్మలున్నారో, అలాగే సికింద్రాబాదులోని వారాసిగూడకు వచ్చిన తర్వా త మా ఇంటిముందు విశ్వకర్మల ఇల్లు ఒకటి వుండేది. వారు ముగ్గురు అన్నదమ్ములు. వివిధ ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ వడ్రంగి పని మరవలేదు. ‘కులవృత్తి మనకు గువ్వల చెన్నా’ అన్న నీతి, రీతి వారిపట్ల నిజమైంది.
వారివి రేకుల ఇండ్లు. వారి ఇంటి ముందున్న నా ఇల్లూ రేకులదే. నాకు ఎదురుగా ఆ ముగ్గురు అన్నదమ్ముల్లో చిన్నవాడు వెంకటాచారి. చాలా తెలివిగలవాడు. ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో పట్టభద్రుడై ఈసీఎల్‌లో ఉద్యోగం చేస్తున్నాడు అప్పట్లో. అతనికి ముగ్గురు పిల్లలు, నాకు కూడా ముగ్గురు పిల్లలు. నాకంటే చిన్నవాడు కనుక నన్ను ఆదర్శంగా తీసుకునే వాడు.
మొదట నా రేకుల ఇల్లు కూల్చి వేసి రెండంతస్తుల బిల్డింగ్ కడితే, తానుకూడా అద్భుతంగా తన రేకుల ఇంటి స్థానంలో బిల్డింగ్ కట్టాడు. నేను స్కూటర్ కొంటే, అతడూ సైకిల్ మానేసి స్కూటర్ కొన్నాడు. స్కూటర్ అమ్మేసి, దాని స్థానంలో కారు కొంటే అతడూ అదే పని చేశాడు.
మా ఇంటికి టీవీ వచ్చిన కొద్దిరోజుల్లోనే వారి ఇంటికీ టీవీ వచ్చింది. ఫ్రిజ్‌కూడా అలాగే వచ్చింది. బస్తీలో అతను, నేనూ కలిసి ఒక సంక్షేమ సంఘం స్థాపించి, నివాసుల సహకారంతో ప్రతి సంవత్సరం వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజుల ఉత్సవాలు జరిపేవాళ్లం. అందువల్ల మేం ఇద్దరు కాలనీవాసులకూ బాగా దగ్గరయ్యాం.
వెంకటాచారి తమ బంధువుతో తీర్థయాత్రలకు వెళితే నన్ను కూడా రమ్మనేవాడు. మా బస్తీలో ఏ తగాదాలు వచ్చినా మేమిద్దరం కలిసి పరిష్కరించే వాళ్లం. ఎవరికే కష్టం వచ్చినా మా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించే వాళ్లం. మాకు అప్పట్లో ఆర్యసమాజ ప్రముఖుడైన చంద్రగిరి యెల్లయ్య తోడుగా ఉండేవారు. సుమారు పాతికేళ్లు ఆ సంఘంలో మేం ఆయా హోదాల్లో ఉన్నాం.
వెంకటాచారివల్ల వారి బంధుజనంలో నాకు గరిష్ఠ సంబంధం ఏర్పడింది. ‘ఈసీఎల్’లో ఒక్క ఉన్నత స్థానంలో ఉండి కూడా ఆయన వీలు దొరికినప్పుడు కర్రతో గృహోపకరణాలను తయారుచేసేవారు. ఉద్యోగం చేస్తూనే, వంశపారంపర్యంగా వస్తున్న వృత్తిని చిత్తశుద్ధితో చేయడం తనలో చూశాను. ఆయన స్వయంగా నా ఇంటి తలుపులను తయారుచేశారు.
ఎలక్ట్రానిక్స్ వస్తువు ఏది కొనాలన్నా నేను వెంకటాచారినే సంప్రదించేవాణ్ణి. ఆయన వారాసిగూడలో నల్గొండనుంచి వచ్చి నివాసం ఏర్పరచుకుంటే నేను పాలమూరు జిల్లా నుంచి వచ్చాను. ఒక విధంగా హైదరాబాదు, సికింద్రాబాదు నగరాలు ఇతర రాష్ట్రాలనుంచి, ప్రాంతాలనుంచి వచ్చిన వారితో అభివృద్ధి చెందినవే.
కష్టంలో ఆదుకొనే మనసు ముఖ్యం
వెంకటాచారి ఇప్పుడు లేడు. ఉద్యోగరీత్యా ఎక్కువగా ఏసీగదిలో ఉండి పని చేయడం వల్ల ఆయనకు శ్వాసకోశ సంబంధమైన వ్యాధి సంక్రమించడంతో 2008లో గతించాడు. కాని, ఆయన నా స్మృతులలోంచి వైదొలగలేదు. అప్పటి ఒక సంఘటన నా కళ్లముందు కదలాడుతుంది. స్నేహం అంటే ఏమిటో ఆయన్ను చూసి అందరూ నేర్చుకోవాలనిపిస్తుంది.
అప్పట్లో నేను రేకుల ఇంటి స్థానంలో పక్కా బిల్డింగు కడుతున్నాను. పునాదికి రాయి అవసరమైంది. లారీ డ్రైవరు రాళ్లను మా ఇంటిముందు రోడ్డుమీదే వేసి వెళ్లిపోయాడు. వాహనదారులకు ఇబ్బంది ఏర్పడింది. నేను ఉద్యోగరీత్యా ఉదయం 8.30 గంటలకే సికింద్రాబాద్ పిజీ కళాశాలకు వెళ్లిపోయాను. నాకు నా అర్థాంగి ప్రమీల ఫోను చేసి చెప్పింది
“మున్సిపల్ వాళ్లు వచ్చి రోడ్డుకు అడ్డంగా ఉన్న రాళ్లను తొలగించమని, ఫోర్సు చేస్తున్నారు.”
ఒక్క క్షణం నాకు ఏం చేయాలో పాలుపోలేదు. నేనేమో కళాశాలలో దూరంలో ఉన్నాను. ఎటూ తోచక
“మన ఇంటి ముందున్న వెంకటాచారికి చెప్పు. ఆయన మున్సిపల్ వారితో మాట్లాడతాడు..” అన్నాను.
మా ప్రమీల నా మాటలే వెంకటాచారితో చెప్పింది. ఆయన కూడా అప్పుడు ఆఫీసుకు వెళ్లడానికి సిద్ధమయ్యాడు. కాని, విషయం తెలియగానే వెంటనే ఆగిపోయాడు. తాను స్వయంగా రోడ్డుమీద ఉన్న రాళ్లను మా ఇంటి ముందుకు జరిపారు.
“ఒక గంటసేపు ఒక్కడే కష్టపడి రాళ్లను తొలగించాడని” నా భార్య చెప్పినప్పుడు నాకు నోటమాట రాలేదు. మరీ ఇంతలా, తనది కాని పనులను కూడా చేసిపెట్టే స్నేహితులు వుంటారా? అన్న ప్రశ్నకు వెంకటాచారియే సమాధానం.
అప్పట్నుంచీ నాకు ఆయన మీద ఉన్న అభిమానం, గౌరవం రెట్టింపయ్యాయి. మనకు ఇంటి ముందున్న వారుగాని, ఇంటిపక్కన ఉన్నవారు గాని వెంకటాచారి లాగా ఉంటే ఎంత అదృష్టవంతులో కదా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ. సుమారు మూడు దశాబ్దాలపాటు మేమిరువురం కృష్ణార్జునులలాగా ఉండేవాళ్లం. ఒకరి కొకరం ఏ కష్టం వచ్చినా పరస్పరం పాలు పంచుకునే వాళ్లం. వెంకటాచారి ఇప్పుడు లోకంలో లేకపోయినా నా స్మృతిలో నిక్షేపంగా ఉన్నాడు. ఇంత మంచి మనుషులు ఇప్పుడెవరైనా దొరుకుతారా?
సెల్: 9885654381