12-05-2025 11:42:21 PM
హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ డివిజన్ నూతన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఏసీపీ)గా ఎస్. సదానందం సోమవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మర్యాదపూర్వకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ తోపాటు పోలీస్ కమిషనర్ డాక్టర్ అనురాధను కలిశారు. ఈ సందర్భంగా వారు సదానందాన్ని అభినందించారు. హుస్నాబాద్ డివిజన్ లో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యాన్ని ఇవ్వాలని ఆయనకు సూచించారు. ముఖ్యంగా గంజాయి, ఇతర మత్తు పదార్థాల సరఫరాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అలాగే, అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సదానందం 1996 బ్యాచ్‌కు చెందినవారు. ఆయన గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఎస్ఐగా పనిచేశారు. సీఐగా వరంగల్ పీటీసీ, ఉట్నూర్, అదిలాబాద్ జిల్లాల్లో సేవలందించారు. ఏసీపీగా పదోన్నతి పొందిన తర్వాత రెండేండ్లపాటు కరీంనగర్ ఇంటెలిజెన్స్‌లో విధులు నిర్వర్తించారు. తాజాగా హుస్నాబాద్ ఏసీపీగా బాధ్యతలు స్వీకరించారు. హుస్నాబాద్ డివిజన్ పరిధిలో శాంతిభద్రతలు నెలకొల్పడానికి తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.