28-10-2024 12:00:00 AM
పొగ గమ్మిన ఇంటిలో
ఊపిరి ఊగిసలాడినా
కాలం కదలిక ఆగదు కదా!
కరోనా మారణ హోమంలో
తన ఉనికిని ఎరుక చేసి
దీపావళి మళ్ళీ పలకరించింది
ఇక్కడ ఇప్పుడు గతంలా
సరికొత్త ఉద్దీప్తి లేదు
సృజనాత్మక అభివ్యక్తి కానరాదు
తేరిపార వెతికి చూసినా
వెలుగు రవ్వలు ఎగజిమ్మడం లేదు
మతాబుల దేహంలో
ఆశల మతలబుల ఊసే లేదు
ప్రసరణశీల జీవితంపై
పర్వతమంత బరువుల
మోతలు తప్పడమే లేదు
చతికిల పడిన వెలుగురేఖ
సాంత్వన కోసం చికిత్సలో ఉంది
అచేతనమై విసిరి పడిన పాదం
మళ్లీ నడక ప్రారంభించింది
వెలుగును వెతుక్కుంటూ...
డా. తిరునగరి శ్రీనివాస్