30-01-2026 01:50:55 AM
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి) : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల నామినేషన్లకు చివరి రోజు అయినందున సిట్ విచారణకు హాజరు కావడం సాధ్యం కాదని మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశా రు. జనవరి 30న 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లకు నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ కావడంతో, పార్టీ తరఫున అనేక మందికి అధికార పత్రాలు జారీ చేయాల్సిన బాధ్యత తనపై ఉందని తెలిపారు.
ఈ నేపథ్యంలో నిర్ణీత సమయానికి ఏసీపీ కార్యాలయానికి రావడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్ డివిజన్ ఏసీపీ పి.వెంకటగిరి జారీ చేసిన విచారణ నోటీసుపై కేసీఆర్ గురువారం లిఖితపూర్వకంగా స్పందించారు. క్రైం నంబర్ 243/2024 కేసు విచా రణలో భాగంగా శుక్రవారం విచారణకు హాజరు కావాలని ఇచ్చిన నోటీసుకు ప్రత్యుత్తరంగా, సీఆర్పీసీ సెక్షన్ 160 ప్రకారం తన నివాసంలోనే విచారణ జరపాలని ఆయన స్పష్టం చేశారు.
65 ఏళ్లు పైబడిన వ్యక్తిని స్టేషన్‌కు పిలవలేరు..
తన లేఖలో సెక్షన్ 160 సీఆర్పీసీ నిబంధనలను ఉటంకించిన కేసీఆర్ 65 సంవత్సరాల పైబడిన వ్యక్తిని పోలీస్‌స్టేషన్‌కు హాజరుకావాలని బలవంతం చేయరాదని, అతను నివసించే చోటే విచారణ జరపాల్సిందిగా చట్టం స్పష్టంగా పేర్కొందని గుర్తు చేశారు. తాను ప్రస్తుతం సిద్ధిపేట జిల్లా మార్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామంలోని తన నివాసంలో ఉన్నానని, వేరే తేదీన అక్కడే విచారణ జరపాలని కోరారు. సెక్షన్ 160 ప్రకారం నివాసంలో విచారణ జరిపే విషయంలో ఎలాంటి భౌగోళిక లేదా పరిధి పరిమితులు లేవని కేసీఆర్ తన లేఖలో పేర్కొన్నారు.
భవిష్యత్తులో వచ్చే అన్ని నోటీసులు కూడా తన ఎర్రవల్లి నివాస చిరునా మాకు పంపాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా, ప్రస్తుతం శాసనసభలో ప్రతిపక్ష నేతగా, బాధ్యతాయుత పౌరుడిగా తాను విచారణకు పూర్తి సహకారం అందిస్తానని కేసీఆర్ భరోసా ఇచ్చా రు. చట్ట పరిధిలోనే విచారణ జరగాలని, తన హక్కులను గౌరవించాలని ఆయన కోరారు. కేసీఆర్ లేఖతో రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి చర్చ మొదలైంది. ఒకవైపు ఎన్నికల వేడి, మరోవైపు కేసీఆర్‌కు సంబం ధించిన విచారణ అంశం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
పోలీసులు దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. అయితే గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేపట్టిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు పంపించిన సమయంలోనూ కేసీఆర్ ఇదే తరహాలో గడువు కోరారు. కొన్ని వ్యక్తిగత కారణాలతో విచారణను వాయిదా వేయాలని కోరగా ఘోష్ కమిషన్ అంగీకరించింది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసులోనూ విచారణకు కేసీఆర్ గడువు కోరారు. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు విచారణను వాయిదా వేస్తారా లేదా అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది.
కేటీఆర్, హరీశ్‌రావులతో కీలక భేటీ..
ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇవ్వడంతో రాజకీయంగా వేడెక్కింది. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే హైదరాబాద్‌లోని నందినగర్‌లో కేసీఆర్ నివాసంలో సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన వెంటనే సిరిసిల్లా పర్యటనలో ఉన్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్ధిపేట పర్యటనలో ఉన్న హరీశ్‌రావు ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాంహౌస్‌కు చేరుకు న్నారు.
సిట్ నోటీసుల నేపథ్యంలో పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ కీలక భేటీ నిర్వహించారు. సిట్ నోటీసుల వెనుక ఉన్న పరిణా మాలు, రాజకీయ ప్రభావాలు, చట్టపరమైన అంశాలపై విస్తృతంగా చర్చించిన ట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటికే హరీశ్‌రావు, కేటీఆర్, సంతోష్‌రావు హాజరైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో విచారణకు సంబంధించిన అంశాలపై కేసీఆర్ ఆరా తీసినట్టు తెలుస్తోంది. దీంతోపాటు మున్సిపల్ ఎన్నికల కారణంగా నాయకులను సమ న్వయం చేయడం ముఖ్యమని భావించినట్టు సమాచారం.
ఈ మేరకు విచారణను వాయిదా వేయాలని కోరాలని నిర్ణయించిన కేసీఆర్ న్యాయ నిపుణులతోనూ సంప్రదింపులు జరిపారు. వారి సలహాల మేరకు జూబ్లీహిల్స్ ఏసీపీకి లిఖితపూర్వకంగా స్పందించారు. సిట్ అధికారులకు రాసిన లేఖలో పలు న్యాయపరమైన అంశాలను లేవనెత్తారు. ఎర్రవల్లి నివాసంలోనే విచారించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని స్పష్టం చేశారు. సిట్ నోటీసులకు స్పందించిన కేసీఆర్ తన లేఖను బీఆర్‌ఎస్ లీగల్ టీంతో అధికారులకు పంపించినట్టు తెలుస్తోంది. కేసీఆర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న సిట్ అధికారులు.. న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం విచారణ తేదీని నిర్ణయించి మరో నోటీసు జారీచేయనున్నారు.