calender_icon.png 30 January, 2026 | 3:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శివమెత్తిన వనం

30-01-2026 01:45:26 AM

వనం వీడి జనంలోకి సమ్మక్క తల్లి

గౌరవ సూచకంగా గాలిలో గన్ పేల్చిన పోలీసులు

మేడారం మహాజాతరలో ప్రధానఘట్టం పూర్తి

జయజయ ధ్వానాలతో సమ్మక్కకు స్వాగతం

సాయంత్రం 6.55 గంటలకు చిలకలగుట్ట నుంచి కిందకు దిగిన సమ్మక్క తల్లి

రాత్రి 9.45 గంటలకు గద్దె మీద ప్రతిష్ఠ

మేడారం, జనవరి 29 (విజయక్రాంతి): మేడారంలో గురువారం రాత్రి పండువెన్నెల వెలుగుల్లో భక్తకోటి శివాలూగింది. చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లి మేడారం గద్దెకు ఆగమనంతో మహా జాతర ప్రధాన ఘట్టం ఆవిష్కృతమైంది. భక్తులకు దర్శనమిచ్చేందుకు అమ్మలగన్న అమ్మ సమ్మక్క తల్లిని గద్దెపై మహాదిష్టానం చేశారు. జయజయ ధ్వానాలతో భక్తకోటి సమ్మక్కకు స్వాగతం పలికింది. మహాజాతరలో గురువారం సాయంత్రం ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ చిలకలగుట్ట వద్ద గౌరవ సూచకంగా గాల్లోకి తుపాకీ పేల్చారు.

అనంతరం 6.55 గంటలకు చిలకలగుట్ట నుంచి సమ్మక్క తల్లిని కిందకుదించారు. కుంకుమ భరిణె రూపం లో ఉన్న సమ్మక్క దేవతకు దీపదూప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసేందుకు ముందుగా సమ్మక్క  ప్రధాన పూజారులు కొక్కెర కృష్ణయ్య, ఇతర పూజారులు ముత్యాల సత్యం, సిద్దబోయిన మునిందర్, సిద్దబోయిన బొక్కన్న, కొమ్ము స్వామి, కొమ్ము జనార్దన్ తదితరులు చిలకలగుట్ట పైకి చేరుకున్నారు. మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కలెక్టర్ దివకర టీ ఎస్, ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్‌ల సమక్షంలో గిరిజిన సాంప్రదాయాలతో పూజలు నిర్వహించారు.

అనంతరం మూడంచల భద్రత మధ్య చిలకల గుట్ట నుంచి మేడారానికి సమ్మక్క తల్లి బయలు దేరారు. రాత్రి 9.45 గంటలకు మేడారం గద్దెలపైకి సమ్మక్క చేరుకున్నది. దాదాపు రెండు కిలోమీటర్ల మేర రహదారిలో భక్తులు అందమైన ముగ్గులు వేశారు. తల్లి రాకను పురస్కరించుకుని మేకలు, గొర్రెలు, కోళ్లు బలిచ్చి రక్త తర్పణం చేశారు. దీంతో రోడ్డు అంతా అరుణవర్ణంగా మా రింది.

ఉద్విగ్నమైన మహాఘట్టాన్ని తిలకించేందుకు లక్షలాది మంది భక్తులు చిలకలగుట్ట రహదారికి ఇరువైపులా నిలబడి జై సమ్మక్క.. జై జై సమ్మక్క అంటూ జయజయ ధ్వారాలు పలికి తమకు ఆ తల్లి దీవెనలు ఉండాలని మదినిండా వేడుకున్నారు. మేడారం మహా జాతరలో ప్రధాన ఘట్టం ఆవిష్కృతం అవ్వడంతో భక్తులు పులకించిపోయారు. ప్రతి రెండూ సంవత్సరాలకు ఒకసారి మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిండు వెన్నెల వెలుగుల్లో సమ్మక్క తల్లిని పూజారులు గద్దెపై  ప్రతిష్ఠిస్తారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు ప్రతిరూపాలు మేడారం గద్దెలపై కొలువు తీరారు.