30-01-2026 02:00:51 AM
మేడారం, జనవరి 29 (విజయక్రాంతి): సుమారు 70 ఎకరాల విస్తీర్ణంలో మేడారం జారతకు సంబంధించి శాశ్వత మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. మేడారం జాతర శాశ్వత అభివృద్ధి కోసం ఇప్పటికే 29 ఎకరాల భూమిని సేకరించామని, మరో 41 ఎకరాల భూసేకరణ ప్రక్రియ కొనసాగుతోందని మంత్రి తెలిపారు. ఈ ప్రాంతంలో శాశ్వతంగా కాటేజీలు, ఫంక్షన్ హాళ్లు, మరిన్ని మరుగుదొడ్లు, స్నానపు గదులు నిర్మించనున్నట్లు వివరించారు.
మేడారం మహా జాతరలో భక్తుల తాకిడి గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని ఆయన చెప్పారు. మేడారంలో గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. మేడారం ప్రాంతానికి ఇప్పటికే ఒక సమగ్ర మాస్టర్ ప్లాన్ సిద్ధమైందని, దాని ప్రకారం అంతర్గత రోడ్ల అభివృద్ధి, ఎకో పార్కుల ఏర్పాటు, పర్యాటక సౌకర్యాల విస్తరణ చేపట్టనున్నట్లు మంత్రి వెల్లడించారు.
గురువారం దాదాపు 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని చెప్పారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి తరలివస్తున్నారని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తోందని మంత్రి స్పష్టం చేశారు.
బాసర టెంపుల్ సర్క్యూట్
దక్షిణ భారత కుంభమేళాగా పేరొందిన మేడారం జాతర ప్రాధాన్యతను మరింత పెంచేందుకు బాసర నుంచి భద్రాచలం వరకు రూ.2,500 కోట్ల వ్యయంతో టెంపుల్ సర్క్యూట్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతంలోని ప్రముఖ ఆలయాల అభివృద్ధిలో మేడారం ఆలయాన్ని కూడా భాగంగా చేర్చనున్నట్లు ఆయన ప్రకటించారు. జంపన్న వాగులో ఏడాది పొడవునా నీరు ఉండేలా చర్యలు తీసుకుంటు న్నామని తెలిపారు.
ఇందుకోసం రామప్ప, --లక్నవరం, --జంపన్న వాగు వరకు పైప్‌లైన్ ద్వారా నీటిని తరలించే ప్రాజెక్టును సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారని, వాగుపై చెక్‌డ్యామ్‌లు నిర్మించి శాశ్వత నీటి నిల్వకు ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న దుష్ర్పచారాలను నమ్మవద్దని భక్తులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని స్పష్టం చేశారు.
కేంద్రం నయా పైసా ఇవ్వలేదు
మేడారం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నయా పైసా కూడా సహాయం చేయాలేదని మంత్రి పొంగులేటి వెల్లడించారు. మేడారం అభివృద్ధికి కేంద్రం రూ.3.26 కోట్లు ఇచ్చినట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి చెప్పినదాంట్లో వాస్తవం లేదన్నారు. కిషన్‌రెడ్డికి మాటలు చెప్పడం తప్పా చేసిందేమీ లేదన్నారు.
తక్కువ సమయంలోనే అభివృద్ధి పనులు పూర్తి: మంత్రి సీతక్క
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మా ట్లాడుతూ.. ఈసారి గతంలో ఎన్నడూ లేని విధంగా రెండు రోజుల్లోనే 70 నుంచి 80 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంకల్పంతో, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పర్యవేక్షణలో అత్యంత తక్కువ సమయంలో ఆలయ అభివృద్ధి పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు.
గతంలో ఇరుకైన రోడ్ల కారణంగా ఇబ్బందులు ఉండేవని, ఈసారి ఫోర్-లేన్ రోడ్లతో రాకపోకలు చాలా సులభ మయ్యాయని తెలిపారు. భవిష్యత్తులో శాశ్వత తాగునీటి వ్యవస్థతో పాటు భారీ సంఖ్యలో శాశ్వత మరుగుదొడ్ల నిర్మాణం అవసరమని ఆమె అభిప్రాయపడ్డారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని విస్తృతంగా చెట్ల పెంపకం చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.