30-01-2026 01:48:08 AM
హైదరాబాద్, జనవరి 29 (విజయక్రాంతి) : సుదీర్ఘ కాలంగా బీసీలు తమ జనాభా ప్రకారం వారికి రిజర్వేషన్ అమలు కావాలని ఎదురుచూస్తున్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్య, ఉపాధి రంగాల్లో బీసీల హక్కు సాకారం చేసుకునేందుకు ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్నారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీతో బీసీ వర్గాల్లో ఆశలు చిగురించాయి. రాష్ట్ర జనాభాలో పెద్ద వాటా ఉన్న బీసీ వర్గాలకు రాజకీయంగా, పరి పాలనాపరంగా తగిన ప్రాతినిధ్యం కల్పిస్తామని అధికార పక్షం హామీ ఇచ్చింది.
కానీ ఆ హామీ చట్టబద్ధ హక్కుగా మారకుండానే స్థానిక ఎన్నికల నిర్వహణ కొనసాగుతుండటం తీవ్ర చర్చకు దారితీస్తోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిసి, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగనుండగా.. రిజర్వేషన్ల విషయంలో అదే వైఖరి కనిపిం చడంతో బీసీల హృదయాలను కలచివేస్తున్నది. ఎన్నికల వేళ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటూ ఆశలు రేపిన ప్రభుత్వం ఈ డిమాండ్‌ను అమలుచేసే దశలో స్పష్టత చూపించలేకపోతోందని బీసీలు ఆగ్రహిస్తున్నారు.
బీసీ రిజర్వేషన్ విషయంలో ప్రతిపక్షాలు సైతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో బాధ్యతాయుతంగా వ్యవహరించడం లేదని బీసీ సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ హామీ కేవలం గాలిమాటేనా అని బీసీలు ఆవేదన చెందుతున్నారు. ఎన్నికల ముందు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలుచేస్తామని ఘనంగా ప్రకటించిన కాంగ్రెస్ నాయకులు..
అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని చట్టబద్ధంగా అమలు చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలు బీసీల నుంచి వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగ సవరణలు, జనాభా లెక్కలు, న్యాయపరమైన అడ్డంకుల పేరుతో నిర్ణయాలు వాయిదా పడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అనేది సాధారణమైన హామీ కాదు. బీసీల సామాజిక న్యాయానికి అది నిదర్శనం.
చట్టబద్ధత లేకుండానే పంచాయతీ ఎన్నికలు..
బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పిన పాలక పక్షం, ఆ హామీని చట్టంగా మార్చకుండానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించింది. కోర్టు ఆదేశాలు, జనగణన పేరుతో కాలయాపన జరిగింది. చివరకు పార్టీపరంగా టికెట్లు ఇచ్చి బీసీలకు న్యాయం చేసినట్టుగా ప్రచారం చేసింది. కానీ ఈ పరిస్థితి బీసీ వర్గాల్లో అనేక ప్రశ్నలకు దారితీసింది. నిజంగా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలన్న రాజకీయ సంకల్పం ఉందా?, లేక ఎన్నికల ఒత్తిడిలో తాత్కాలిక పరిష్కారంతో సరిపెట్టుకున్నారా? అని అనుమానాలు వ్యక్తమయ్యాయి.
పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు కొన్ని స్థానాలు దక్కినప్పటికీ అవి రిజర్వేషన్ వల్ల వచ్చిన హక్కులా?, లేక పార్టీ టికెట్ల పంపిణీలో భాగమా? అన్నది ఇప్పటికీ వివాదాస్పదంగానే ఉంది. బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ అమలు కాకుండానే పంచాయతీ ఎన్నికలు జరగడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది. పార్టీల అంతర్గత కేటాయింపుల పేరుతో కొంతమంది బీసీలకు అవకాశాలు ఇచ్చినా.. అది భరోసా కల్పించే రిజర్వేషన్ కాదని బీసీ నేతలు అంటున్నారు.
పంచాయతీ ఎన్నికలతో బీసీ రిజర్వేషన్ అంశంపై ఆయా వర్గాల్లో పాలక, ప్రతిపక్షాల వైఖరిపై స్పష్టత వచ్చింది. రాజ్యాంగం, జనాభా లెక్కలు, న్యాయపరమైన చిక్కులు అంటూ కారణాలు చెబుతూ కాలం వెళ్లదీస్తున్నారన్న విమర్శలు బీసీ వర్గాల్లో తీవ్ర ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. బీసీలకు చట్టబద్ధమైన రిజర్వేషన్ ఇవ్వకుండానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని విమర్శకులు అంటున్నారు.
రిజర్వేషన్ అవసరమని నినాదాలు చేసి.. అమలు చేయాల్సిన సమయంలో మాత్రం చేతులెత్తేస్తారని తీవ్రంగా విమర్శిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు లభించిన సీట్లు పార్టీ దయతో వచ్చిన అవకాశాలుగానే మిగిలాయని, దీంతో సరైన రాజకీయ ప్రాతినిధ్యం లభించలేదన్న అభిప్రాయం బలపడుతోంది. చట్టం ఉంటేనే ప్రతి బీసీకి సమాన అవకాశం లభిస్తుందని, లేకపోతే ఇది కేవలం ఎన్నికల హామీగా మిగిలిపోతుందని బీసీలు విమర్శిస్తున్నారు.
రాజకీయ రూపంగా బీసీల ఆగ్రహం..
42 శాతం రిజర్వేషన్ హామీ అమలవుతుందా? లేక మళ్లీ ఎన్నికల దాకా నినాదాలకే పరిమితమవుతుందా? అన్న ప్రశ్న బీసీ సమాజాన్ని వేధిస్తోంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బీసీలకు రిజర్వేషన్ అమలుచేయడంలో అన్యాయం జరిగిందని స్పష్టమవు తుంది. ఇప్పటివరకు ఓర్పుతో ఎదురుచూసిన బీసీ సంఘాలు, మేధావులు, యువత ఇప్పుడు చట్టబద్ధ రిజర్వేషన్ తప్ప మరే ప్రత్యామ్నాయం లేదని అభిప్రాయపడుతున్నారు. 42 శాతం రిజర్వేషన్ అమలయ్యే వరకు బీసీల రాజకీయ పోరాటం ముగియదన్న సంకేతాలు ఇస్తున్నారు.
హామీలతో కాదు, చట్టంతోనే న్యాయం కావాలన్న డిమాండ్ మరింత బలపడుతోంది. పాలక, ప్రతిపక్షాలపై బీసీ వర్గాల్లో నెలకొన్న అసంతృప్తి ఉద్యమంగా మారుతుందా.. లేక ఎన్నికల్లో రాజకీయ తీర్పుగా బయటపడుతుందా అని ప్రభుత్వంలోనూ ఆందోళన కలిగిస్తున్నది. 42 శాతం రిజర్వేషన్ కేవలం నినాదం కాదని, బీసీల రాజకీయ భవిష్యత్‌కు కీలక మలుపు అని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్ అమలుపై స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. ఈ అంశంలో ఇంకా జాప్యం జరిగితే భవిష్యత్ ఎన్నికల్లో బీసీల తీర్పు రాజకీయ చరిత్రను మార్చే అవకాశముందని విశ్లేషకులు అంటున్నారు.
మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి..
తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలటీలకు ఎన్నిలక నోటిఫికేషన్ విడుదల అయింది. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. కానీ ఇప్పటికీ బీసీల 42 శాతం రిజర్వేషన్‌పై చట్టపరమైన స్పష్టత లేదు. పంచాయతీ ఎన్నికల్లో చేసినట్లే మళ్లీ పార్టీపరమైన సర్దుబాట్లతో బీసీలకు న్యాయం చేసినట్టు చూపించాలని ప్రభుత్వం ప్రయత్ని స్తున్నదని బీసీలు ఆరోపిస్తున్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో పాలక, ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నాయని విమర్శిస్తున్నారు.
ఒకవైపు బీసీలే సామాజిక వెన్నెముక అంటూనే మరోవైపు వారి రాజకీయ హక్కులను చట్టంగా మార్చడంలో వెనుకడుగు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయంగా బీసీల మద్దతు పొందుతూనే వారికి హక్కులు కల్పించేందుకు భయపడుతున్నారని విమర్శిస్తున్నారు. ఈ వైఖరే పాలక, ప్రతిపక్షాలపై ఉన్న నమ్మకాన్ని చెరిపేస్తోందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. బీసీ రిజర్వేషన్ అమలు చేయాలనే చిత్తశుద్ధి ఉంటే చట్టపరమైన మార్గాలు కనుగొనడం అసాధ్యం కాదని వాదిస్తున్నాయి.
ఇతర రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్ అమలు సాధ్యమైనప్పుడు తెలంగాణలో ఎందుకు సాధ్యం కావడం లేదన్న ప్రశ్న బలంగా వినిపిస్తోంది. పంచాయతీ ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లోనూ బీసీలకు తీవ్ర నిరాశే ఎదురైందని ఆ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరి మరోసారి బీసీలకు చేస్తున్న ద్రోహమేనని మండిపడుతున్నాయి. బీసీలను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ, అధికారంలోకి వచ్చాక హామీలను పక్కన పెడుతున్నారన్న విమర్శలు రాజకీయంగా వేడెక్కుతున్నాయి.