calender_icon.png 11 December, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చరిత్రలో తొలిసారి రోడ్ సెక్టార్ పాలసీ

10-12-2025 02:56:14 AM

  1. తెలంగాణ సమగ్రాభివృద్ధికి కొత్త సంస్కరణలు
  2. ప్యానెల్ డిస్కషన్‌లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

హైదరాబాద్, డిసెంబర్ 9 (విజయక్రాంతి): మా అభివృద్ధి వ్యూహం ఒకే రంగానికి పరిమితం కాదని, రోడ్లు, రైల్వేలు, విమానయానం, డిజిటల్ మౌలిక వసతులు, కరెంట్, ఆరోగ్యం, లాజిస్టిక్స్ వంటి అన్ని రంగాలు ఒకేసారి ముందుకు వెళ్లేలా ప్రణాళిక రూపొందించామని, ఈ క్రమంలో రాష్ర్ట చరిత్రలోనే తొలిసారి రోడ్ సెక్టర్ పాలసీని తీసుకొచ్చామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టంచేశారు. ‘కనెక్టెడ్ తెలంగాణ ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట అండ్ అర్బన్- రూరల్ కనెక్టివిటీ’ అనే అంశంపై గ్లోబల్ సమ్మిట్‌లో జరిగిన ప్యానెల్ డిస్కషన్‌లో మంత్రి పాల్గొని మాట్లాడారు.

తమ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి, ప్రజల సాధికారతపై పూర్తి దృష్టి సారించిందని, ఇందులో భాగంగానే ఈ గ్లోబల్ సమ్మిట్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి చురుకైన నాయకత్వంలో రాష్ర్ట మొత్తం సమగ్రంగా అభివృద్ధి చెందేలా అనేక కొత్త సంస్కరణలు, పెద్ద ప్రాజెక్టులు ప్రారంభించామని వివరించారు. వేగంగా పారిశ్రామికీకరణ జరగాలంటే కనెక్టివిటీ అన్ని వైపులా మెరుగుపడాలన్నారు.

మానవాభివృద్ధి సూచీలు పెరగడంతోపాటు భవిష్యత్తు మొబిలిటీకి సరిపోయే మౌలిక వసతులు రావాలని, అందుకే అన్నీ కలిపి ఒక సమగ్ర వ్యవస్థను నిర్మిస్తున్నామని వెల్లడించారు. వచ్చే రెండు దశాబ్దాలపాటు అమలు చేయబోయే ‘రైజింగ్ తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’కు గ్లోబల్ సమ్మిట్ పునాది అని చెప్పారు. తెలంగాణ ల్యాండ్- లాక్డ్ రాష్ర్టం అనే పరిమితిని అధిగమిస్తూ,

అత్యాధునిక డ్రై పోర్ట్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రాన్ని బలమైన ఆర్థిక కేంద్రంగా మార్చడానికి ఇది కీలకమన్నారు. తెలుగు రాష్ర్ట రాజధానులను కలిపే 8-లేన్ గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే, శ్రీశైలం దేవస్థానానికి ఎలివేటెడ్ కారిడార్ వంటి ప్రాజెక్టులను కూడా తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా తీసుకుంటోందని తెలిపారు.