calender_icon.png 24 July, 2025 | 12:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే చేసిందేమీ లేదు..

23-07-2025 04:35:42 PM

మా శిలాఫలకం తొలిగించడం ఎంతవరకు న్యాయం..

ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి నిజం కాదా..?

ఇంటిగ్రెటెడ్ మార్కెట్ ఎందుకు ఓపెన్ చేయడం లేదు..?

ఆసుపత్రి సందర్శనలో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు ధ్వజం..

లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని 30 పడకల ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి నిర్మాణానికి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు(MLA Prem Sagar Rao) చేసింది ఏమీ లేదు అని మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు మండిపడ్డారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని బీఆర్ఎస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు మాట్లాడుతూ.... బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 30 పడకల సామాజిక ఆసుపత్రికి బీజం పడిన మాట నిజం కదా? అని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావును ముక్కు సూటిగా ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మాణం పూర్తి చేసుకుని అసెంబ్లీ సాధారణ ఎన్నికల అనంతరం ప్రారంభమైనంత మాత్రాన కర్త, కర్మ, క్రియ నేనే అని చెప్పుకోవడం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకే దక్కిందని ఏద్దేవా చేశారు. అప్పటి ఎమ్మెల్సీగా ఉండి కనీసం లక్షేట్టిపేట వైపు కన్నెత్తి చూడని ప్రేమ్ సాగర్ రావుకు ఈ ఆసుపత్రి నిర్మాణంతో ఏలాంటి సంబంధం లేదని నొక్కి చెప్పారు.

అప్పటి ఎమ్మెల్సీగా ఉండి 2013 లో తాను రాసిన లెటర్ ద్వారా ఈ ఆసుపత్రి నూతన భవనం మంజూరైనట్లు చెప్పుకోవడం ప్రేమ్ సాగర్ రావు మోసపూరిత తనానికి నిదర్శనమన్నారు.  మా హయాంలో ఆరోగ్యశాఖ మాజీ మంత్రి హరీష్ రావు చేతుల మీదుగా రూ. 8 కోట్లపై చిలుకు నిధులతో నిర్మిస్తే ఇప్పుడు చివరి దశలో ఓపెనింగ్ చేసి సొమ్ముకరిది సొకొకరిదనే ప్రవర్తన ప్రేమ్ సాగర్ రావులో కనిపిస్తుందని వ్యంగాస్త్రాలు సంధించారు. జిల్లా అధికారులు కూడా మా ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన ఆసుపత్రి శిలాఫలకంను ఏ నిబంధనల మేరకు తొలగించారో తెలిపాలని, వెంటనే మా శిలాఫలకంను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు హద్దులు దాటితే చూస్తూ ఊరుకోమన్నారు.

నిజంగా ఎమ్మెల్యేకు చిత్తశుద్ధి ఉంటే ఇంటిగ్రెటెడ్ మార్కెట్ ను ఎందుకు ప్రారంభించడం లేదో జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యాపారాలు చేసుకునే వారికి ప్రారంభోత్సవం అయితే దుకాణాలు ఏర్పాటు చేసుకుంటారు గాని వ్యాపారులు ఇక్కడికి రావడం లేదని కుంటి సాకులతో తప్పించుకోవడం కాంగ్రెస్ నాయకులు వ్యాపారులను మోసం చేయడమేనన్నారు. అంతేకాకుండా ఇందిరమ్మ ఇండ్లలో అవినీతి లేదని కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం వింతగా ఉందన్నారు. ఒకవైపు మీడియాలో ఆధారాలతో కథనాలు వస్తుంటే కాంగ్రెస్ వాళ్ళు కల్లబొల్లి మాటలు చెప్పడం ప్రజలను మభ్యపెట్టడమేనని విరుచుకుపడ్డారు.

ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పేవి అన్ని అబద్ధాలు అని మా ప్రభుత్వ హయాంలో చేసుకున్న పనులను తన ఖాతాలో వేసుకోవడం ఎంతవరకు న్యాయమో ప్రజలు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. అంతకుముందు మాజీ మున్సిపల్ చైర్మన్ నల్మాసు కాంతయ్య మాట్లాడుతూ మా పనులకు గుర్తింపు రాకుండా చేయడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పని చేస్తున్నారని ఇది మంచి పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే తన పద్ధతి మార్చుకోవాలని సూచించారు. ప్రభుత్వం మారినంత మాత్రాన మేము చేసిన మంచి పనులు ప్రజల గుండెల్లో లేకుండా పోతాయా? అని ఎమ్మెల్యే ను ప్రశ్నించారు. ఇకనైనా ఇంటిగ్రెటెడ్ మార్కెట్ ను వెంటనే ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు.

అంతకుముందు మాజీ ఎమ్మెల్యే స్థానిక నాయకులతో కలిసి ఆసుపత్రిలోని పలు వార్డ్ లను పరిశీలించి రోగులకు అందుతున్న సౌకర్యాల గురించి వాకబు చేశారు. ఆసుపత్రిలో సరిపడినంత వైద్య సిబ్బంది లేరని జిల్లా కలెక్టర్ ను వీలైనంత త్వరలో సరిపడ సిబ్బందిని నియమించేలా కోరుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్ లు తిప్పని లింగయ్య,కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బీ ఆర్ ఎస్ పట్టణ, మండల అధ్యక్షులు పాదం శ్రీనివాస్, చుంచు చిన్నయ్య, సర్పంచ్ లు గోళ్ల రవీందర్, సురేష్, పురుషోత్తం, సుధాకర్, మాజీ కౌన్సిలర్లు శ్రీకాంత్, మెట్టు కళ్యాణి రాజు, మండల యూత్ అధ్యక్షులు అంకతి గంగాధర్,ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ చాంద్, నాయకులు బత్తుల సత్తయ్య, అన్వర్,రామూర్తి, వెంకటేష్, మారుతీ తదితరులు పాల్గొన్నారు.