24-01-2026 12:25:13 AM
మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి హెచ్చరిక
రంగారెడ్డి, జనవరి 2౩( విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా యాచారం మండలం నందివనపర్తి గ్రామంలోని పురాతన ఓంకారేశ్వరాలయ దేవాదాయ భూములను పరిశ్రమల పేరుతో స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను రంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. శనివారం నందివనపర్తి గ్రామానికి చెందిన రైతు నాయకులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు కిషన్ రెడ్డిని కలిసి, ప్రభుత్వం భూసేకరణ పేరుతో తమ పొట్ట కొడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు పూర్తి మద్దతు ప్రకటిస్తూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదాయ భూములపై ఆధారపడి ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్న కౌలు రైతుల నోటికాడ కూడు తీసేయడం దుర్మార్గమని కిషన్ రెడ్డి మండిపడ్డారు. ‘దేవుడి భూముల జోలికి వెళ్లిన వారు బాగుపడిన దాఖలాలు చరిత్రలో లేవు. ప్రభుత్వ నిర్ణయం శాపంగా మారుతుంది‘ అని ఆయన హెచ్చరించారు. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని,లేనిపక్షంలో రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని స్పష్టం చేశారు.
దేవాలయ ఆస్తులను, రైతుల హక్కులను కాపాడే వరకు తమ పోరాటం ఆగదని ఆయన భరోసా ఇచ్చారు. ‘పరిశ్రమల స్థాపన పేరుతో దైవ కార్యాలకు కేటాయించిన భూములను లాక్కోవడం ఆమోదయోగ్యం కాదు. ఇది పేద రైతులకు, భక్తుల నమ్మకాలకు తీరని అన్యాయం. ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, యాచారం మండల పార్టీ అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, ప్రధాన కార్యదర్శి భాష, నందివనపర్తి మాజీ సర్పంచ్ వర్త్యవత్ రాజు నాయక్ తదితరులు పాల్గొన్నారు.