05-01-2026 02:00:46 AM
నాగర్‌కర్నూల్, జనవరి 4 (విజయక్రాంతి): నాగర్‌కర్నూల్ జిల్లాలో నోటి దురుసుగా వ్యవహరించిన కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ నేతకు తండా వాసులు దేహశుద్ధి చేశారు. కంట్లో కారం చల్లి పిడిగుద్దులు కురిపించారు. ఈ ఘటన డిసెంబర్ 31 అర్ధరాత్రి చోటు చేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి యువజన కాంగ్రెస్‌లో ప్రధాన లీడర్‌గా పనిచేస్తున్నాడు. డిసెంబర్ 31న అర్ధరాత్రి ఆ గ్రామ సమీప తండాలో వాలీబాల్ కోర్టు వద్ద నూతన సంవత్సర సందర్భంగా కేక్ కట్ చేసేందుకు గుమ్మిగూడారు.
అక్కడే మరికొందరు బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన వ్యక్తులు వేడుకల్లో పాల్గొన్నారకు. వారిపై సదరు కాంగ్రెస్ నేతతో పాటు తన అనుచరులు నోరు పారేసుకున్నారు. తండావాసులు, వారి మహిళలపై అసభ్యంగా మాట్లాడారు. దీంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి గొడవకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తండాలోని కొంతమంది మహిళలు, గొడవకు కారణమైన లీడర్ కంట్లో కారం చల్లి పిడుగుద్దులు కురిపించారు.
దీంతో జనవరి 1న తెల్లవారుజామున పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుమారు పదిమందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందుగా వారే తమపై అకారణంగా దుర్భాషలాడుతూ దాడి చేశారని తండవాసులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరు వర్గాల నుంచి ఫిర్యాదులు అందాయని విచారించి చర్యలు తీసుకుంటామని ఎస్సై గురుస్వామి తెలిపారు.