05-01-2026 02:02:46 AM
రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎత్తివేసే వరకు ఉద్యమిస్తాం
బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించాల్సిందే
కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పాలి
జిల్లాలకు బీసీ నేతల పేర్లు పెట్టాలి
కాకినాడ బీసీ సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్
ఏపీ అధ్యక్షుడు కేసన శంకర్‌రావు హాజరు
హైదరాబాద్, జనవరి 4 (విజయక్రాంతి): దేశంలో సామాజిక రిజర్వేషన్లపై ప్రస్తుతం అమలులో ఉన్న 50% పరిమితిని తక్షణమే రద్దుచేసి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్‌రావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఏపీలోని కాకినాడలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి పంపన రామకృష్ణ ఆధ్వర్యంలో బీసీ సంక్షేమ సంఘం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా జాజుల శ్రీనివాస్ గౌడ్, శంకర్‌రావు హాజరయ్యారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బీసీ సంక్షేమ సంఘం గత మూడు దశాబ్దాలుగా చేసిన పోరాట ఫలితంగా దేశవ్యాప్తంగా సమగ్ర కులగనన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, కులగనన ఆధారంగా బీసీలకు జనాభా దామాషా ప్రకారం విద్యా ఉద్యోగ రాజకీయ రంగంలో రిజర్వేషన్ పెంచాలని వారు డిమాండ్ చేశారు. అగ్రకులాలకు ఈడబ్ల్యూఎస్ పేరుతో 10% రిజర్వేషన్లు కల్పించినప్పుడు 50% రిజర్వేషన్లు పరిమితి దాటిపోయిందని, బీసీ రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ చేసినప్పుడు మాత్రమే 50% పరిమితిని ముందుకు తీసుకురావడం ఎంతవరకు సమంజసం వారు ప్రశ్నించారు.
మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోట కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల నియమకాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తక్షణమే సమగ్ర కులగన చేపట్టడానికి డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి, సమగ్రమైన కులగణన చేపట్టి ఎన్నికల హామీ ప్రకారం బీసీ రిజర్వేషన్ 34% శాతం పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా బీసీ డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడి పెంచి కేంద్రంలో బీసీల తరపున చక్రం తిప్పాలని సూచించారు.
కాకినాడ జిల్లాకు మల్లాడి సత్య లింగాల నాయకర్, గుంటూరులోని పలనాడు జిల్లాకు ప్రగాఢ కోటయ్య జిల్లాగా, రాష్ట్రంలోని ప్రధాన విమానాశ్రయంకి గౌత లచ్చన్న పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి రాష్ట్ర అధికార ప్రతినిధి పంపని రామకృష్ణ ఆధ్వర్యంలో గుత్తుల రమణ పర్యవేక్షణలో బీసీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంసాని శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో బీసీ నాయకులు యనమల కృష్ణుడు, శ్రీనివాస్ రాజు, భవాని, నాగేశ్వరరావు, కృష్ణ, సూర్యచందర్, రాజేశ్వరరావు, నారాయణ గౌడ్, బిసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, జాతీయ నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, శిరీష, రాము, పెద్దరాజు, తదితరులు పాల్గొన్నారు.