09-01-2026 05:40:56 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి మండలంలో ఎఫ్పీఓ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. మంచిర్యాల జిల్లా సహకార అధికారి ఎం. సత్యనారాయణ ఆదేశాల మేరకు, బెల్లంపల్లి మండలం చంద్రవెల్లి పీఏసీఎస్ (PACS Chandravelly) ద్వారా రైతు ఉత్పత్తిదారుల సంస్థ (FPO) సభ్యత్వ నమోదు శుక్రవారం ప్రారంభించారు. రైతులకు FPO లక్ష్యాలు, ఉద్దేశాలు ఈ పథకం ద్వారా లభించే ప్రయోజనాలు వివరించారు. సమూహ మార్కెటింగ్, మెరుగైన ధరల లభ్యత, వ్యవసాయ ఇన్‌పుట్ల సౌకర్యం, రుణాలు, శిక్షణ రైతుల ఆర్థిక అభివృద్ధి గురించి విపులంగా చెప్పారు.
కన్నాల గ్రామానికి చెందిన బమండ్లపల్లి స్వామి రూ. 2,000 సభ్యత్వ ఫీజు చెల్లించి ఎఫ్పీఓ సభ్యత్వం పొందారు. ఏరియా ఆఫీసర్, జి.సందీప్ కుమార్, అడాప్షన్ ఆఫీసర్ బి. సురేందర్, చంద్రవెల్లి పీఏసీఎస్ కార్యదర్శి సంస్థ సిబ్బంది సహాయకులు రైతులకు అవగాహన కల్పించి, సభ్యత్వం తీసుకోవాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి రైతుల నుంచి మంచి స్పందన లభించగా, రాబోయే రోజుల్లో మరింత ఎక్కువ మంది రైతులు ఎఫ్పీఓ సభ్యత్వం పొందేందుకు ఆసక్తి చూపాలని కోరారు.