24-07-2025 12:31:30 AM
వనపర్తి శాసన సభ్యుడు తూడి మేఘారెడ్డి
వనపర్తి, జూలై 23 : మహిళా సాధికారతతో పాటు నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీ ని లాభాల్లో తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం మహలక్ష్మీ పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించిందని వనపర్తి శాసన సభ్యులు తూడి మేఘా రెడ్డి అన్నారు.
డిసెంబర్ 9, 2023 న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి మహాలక్ష్మి పథకం ప్రారంభించి నేటికి రాష్ట్రవ్యాప్తంగా 200 కోట్ల ప్రయాణాలు పూర్తి అయిన సందర్భంగా బుధవారం ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి బస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మహిళలకు సన్మాన కార్యక్రమానికి వనపర్తి శాసన సభ్యులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వము తెలంగాణ సెంటిమెంట్ మీద అధికారం పొంది ఆర్టీసీని భ్రష్టు పట్టించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఆర్టీసీకి పూర్వవైభం తీసుకురావడంతో పాటు మహిళలకు ఆత్మగౌరవం, ఆర్థిక సాధికారత సాధించేందుకు మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించిందన్నారు.
తద్వారా 2023 డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు సాగించారని, ఇందుకు ప్రభుత్వం తరపున ఆర్టీసీకి రూ. 6680 కోట్లు విడతల వారిగా చెల్లించడం జరిగిందన్నారు. ఆర్టీసీకి ఆక్యుపెన్సీ పెరిగి నష్టాల్లో ఉన్న ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్నారు. వనపర్తి బస్ డిపో ద్వారా 2014 నుండి 2023 వరకు ఆర్టీసీ రూ. 57 లక్షలు ఆర్జిస్తే, డిసెంబర్, 9 నుండి ఒక్క సంవత్సరంలోనే రూ. 12.4 కోట్లు, 2024-25 లో 23.09 కోట్లు,
ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 7 కోట్లు లాభం ఆర్జించినట్లు తెలితాజేశారు. అహర్నిషలు కృషి చేస్తూ ప్రజలకు సౌకర్యవంతమైన రవాణా కల్పిస్తున్నందుకు ఆర్టీసీ యాజమాన్యం, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఒక్క వనపర్తి జిల్లాలోనే 2.35 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసినట్లు తెలిపారు. అనంతరం వనపర్తి పట్టణం నుండి ప్రతిరోజూ ఆర్టీసీలో ప్రయాణం చేస్తున్న మహిళలను శాసన సభ్యులు శాలువాలతో సన్మానం చేశారు.
ఈ కార్యక్రమంలో డి.యం. ఆర్టీసీ వేణుగోపాల్, వనపర్తి మార్కెట్ కమిటి చైర్మన్ పి. శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షురాలు స్వరూప, కాంగ్రెస్ పార్టీ మహిళ ప్రతినిధులు శ్రీలత రెడ్డి, మాజీ కౌన్సిలర్లు భువనేశ్వరి, జయసుధ, పార్టీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.