25-10-2025 08:15:38 PM
నారాయణపేట (విజయక్రాంతి): నారాయణపేట మండలం అప్పక్ పల్లి వద్ద గల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం హైదరాబాద్ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్/రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం విజయవంతమైంది. శనివారం ఉదయం ఈ శిబిరాన్ని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్నికా రెడ్డి ప్రారంభించారు. శిబిరంలో ఏఏ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారని వైద్య నిపుణులను ఆమె అడిగి తెలుసుకున్నారు.
క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్య విద్య కౌన్సిలింగ్, మహిళలకు పీఏపీ స్మెర్, క్లినికల్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్, మామోగ్రఫీ, అల్ట్రాసౌండ్ మెడ, అల్ట్రాసౌండ్ ఉదరం పెల్విస్, సోనో మామోగ్రఫీ, డిజిటల్ ఎక్స్ రే ఛాతీ, నోటి పరీక్షలు క్లినికల్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం నిర్వహిస్తామని వైద్య నిపుణులు ఎమ్మెల్యే చిట్టెం పర్నికా రెడ్డికి తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగిన ఈ శిబిరంలో మొత్తం 191 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయ చంద్రమోహన్, జిల్లా ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్ మల్లికార్జున్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డాక్టర్లు, సిబ్బంది, జిల్లా ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.