calender_icon.png 10 May, 2025 | 7:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సవాలక్ష లొసుగులు.. అప్రమత్తత ఎలా?

16-04-2025 12:00:00 AM

తేషాం హరణోపాయాః 

చత్వారింశత్.. 

 కౌటిలీయం:- (2--

రాచరికపు వ్యవహారాలైనా, ప్రజల సౌ కర్యాలకై నిర్వహించే సంక్షేమ కార్యక్రమాలైనా, వ్యవసాయం, పరిశ్రమలు, సేవలు లాంటి సంపదలను సృజించే రంగాలైనా.. వాటి అభివృద్ధికి  పాలకులు చేయూతను ఇవ్వాలి. అందుకు అవసరమైన కోశాన్ని (వస్తురూపంలో లేదా ధనం రూపంలో) ప్రజలవద్ద పన్నుల రూపంలో వసూలు చేసి, ఆ మొత్తాన్ని కోశానికి చేర్చి, జాగర్తగా పర్యవేక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది.

అన్ని పనులనూ ఏ ఒక్కరూ నిర్వహించుకోలేరు కాబట్టి, ప్రతి విభాగానికి పర్యవేక్షలుగా అర్హత కలిగిన అధికారు లను నియమించాలి. వారు వారి బాధ్యతలను సరిగా నిర్వహించేందుకు అవసరమై న అధికారాలను, వనరులను అందచేయాలి. అలాగే, వారి బాధ్యతా నిర్వహణ లో అవకతవకలకు పాల్పడకుండా నియ మ నిబంధనలను రూపొందించి వాటిని కఠినంగా అమలు పరచాలి. సంబంధిత కార్యనిర్వాహకులు తమ పరిధిలో వసూలైన ప్రతి పైసా గణాంక పుస్తకాలలో రాసి, దానికి సంబంధిత రశీదులను జోడించి, వాటిని మూసి వేసి, ముద్రలు వేసి కోశాగార అధ్యక్షునికి సకాలంలో సమర్పించాలి. అయితే, ఇలా చేయని అధికారులకు ఎలాంటి శిక్షలు వేయాలో స్పష్టంగా తెలియ పరిచాడు చాణక్యుడు.

ఎన్ని అవినీతి నిరోధక మార్గదర్శకాలను పాలకులు ఏర్పరచినా, అవినీతిప రులు మరికొన్ని కొత్త దోవలు వెదకడం ఏ కాలంలోనైనా సహజమే. పన్నులు వసూలు చేసి కోశాగారానికి పంపే అధికారులు అవినీతిపరులైతే రాజధనాన్ని అప హరించే అవకాశాలు ఉంటాయి. అలాంటి స్థానాలలో నమ్మకస్థులు, అర్హులైన వారిని నియమించి వారిని నిరంతరం పర్యవేక్షించాలి. ఇందులో పాలకుల అలసత్వం కారణంగా ఆయా విభాగాల అధ్యక్షులు రాజధనాన్ని అపహరించే నలభై ప్రమాదాలను గురించి చెప్పాడు ఆచార్య చాణక్య.

అక్రమ ధనార్జనకు మార్గాలు ఎన్నో..

ముందుగా వచ్చిన సస్యాదికాన్ని (పంటలను) ధనాన్ని కొంతకాలం తాను అను భవించిన తరువాత నిబంధన పుస్తకాలలోకి ఎక్కించడం. కాలం దాటిన పిమ్మట వచ్చే ఆదాయాన్ని ముందుగా వచ్చినట్లు రాయడం (overstating). ఇలాంటివి ముఖ్యంగా లక్ష్యాలను చేరుకోలేకపోయినప్పుడు చేరినట్లుగా చూపి తదుపరి తగ్గిం చుకోవడం చేస్తారు. లంచం మొదలైనవి తీసుకొని వసూలు చేయవలసిన వాటిని వసూలు చేయకపోవడం. పన్నులు చెల్లించవలసిన అవసరం లేనివారి నుంచి వాటిని సేకరించి పుస్తకాలలో చూపక పో వడం.

వసూలైన పన్నులను వసూలైనట్లుగా చూపక పోవడం. వసూలు కాని ప న్నులను వసూలైనట్లుగా చూపడం. తక్కు వ వసూళ్ళను ఎక్కువ చేసి చూపడం (తమ సామర్థ్యాన్ని హెచ్చుగా చూపుకోవడం). ఎక్కువగా వసూళ్ళైనా తక్కువ చేసి చూపడం. ఒక వస్తువును వసూలు చేసి మరొకటి వసూలైనట్లు చూపడం (విలువను తగ్గించి లాభపడడం). ఒకరి నుంచి వసూలు చేసి మరొకరి నుంచి వసూలైనట్లు చూపడం. ప్రజలకు ఇవ్వవలసింది ఇవ్వకపోవడం (సంక్షేమాదులలో). ఇవ్వవలసిన అవసరం లేని దానిని ఇచ్చినట్లు చూపడం. ఇవ్వవలసినప్పుడు ఇవ్వక త ర్వాత ఇవ్వడం. తక్కువగా ఇచ్చి ఎక్కువగా ఇచ్చినట్లు రాయడం. ఎక్కువగా ఇచ్చి త క్కువగా ఇచ్చినట్లు రాయడం.

ఒకటిచ్చి మ రొకటి రాయడం. ఒకరికి ఇవ్వాల్సింది వేరొకరికి (అనర్హులకు) ఇవ్వడం. ఖజానాలోకి వచ్చినా చూపక పోవడం. రాని వాటి ని వచ్చినట్లు చూపడం. ఆటవిక వస్తువుల్ని మూల్యం చెల్లించకుండా కోశంలో చేర్చ డం (గిరిజనులను మోసగించడం). వెల పెట్టి కొన్న దానిని రాయక పోవడం. సమూహం నుంచి వసూలు చేయవలసిన ధనాన్ని వేర్వేరు వ్యక్తులనుంచి వసూలు చేయడం. వేర్వేరు వ్యక్తుల నుంచి గ్రహించ వలసిన దానిని సమూహం నుంచి గ్రహించడం. చాలా ఖరీదైన వస్తువును తీసివేసి దాని స్థానంలో తక్కువ వెలగలిగిన దానిని పెట్టడం. తక్కువ వెల గలదాని స్థానంలో ఎక్కువ వెల గలదానిని ఉంచడం. వస్తువుల ఖరీదును పెంచడం. కొన్ని వస్తువుల ఖరీదును తగ్గించడం.

రోజులు పెంచడం (ఐదు రోజులకు జీతం ఇచ్చి ఏడు రోజులకు చెల్లించినట్లు రాయడం). రోజులు తగ్గించడం (కోశంలో పది రోజులకు డబ్బు తీసుకొని కూలీలకు అయిదు రోజులకే చెల్లించడం). సంవత్సరంలో మాసం లేదా మాసాలు తేడా వచ్చేటట్లు చేయడం (పది మాసాలు పని చేయించుకొని సంవత్సరం పని చేయించుకున్నట్లుగా చూపించి రెండు మాసాల జీతం కాజేయడం. మా సంలోని రోజులలో తేడా చూపడం. ఒక విధంగా వచ్చిన ధనాన్ని మరొక రకంగా వచ్చినట్లుగా చూపడం. ఒక పద్దులోని దానిని మరొక పద్దులో రాయడం.

పనుల కోసం నియమించిన వ్యక్తుల సంఖ్య తప్పు గా చూపడం (నియమిత వ్యక్తులకు తక్కు వ ఖర్చుపెట్టి ఎక్కువ రాయడం. మొత్తం సొమ్ములో తేడాలు చూపడం. నాణ్యతలో తేడాలు చూపడం. ఖరీదులో తేడాలు. తూ కాలలో తేడాలు. కొలతలలో తేడాలు. వ స్తువులు భద్ర పరచే పెట్టెలు మొదలైన వా టి సంఖ్యలో తేడా చూపడం ఇలా రాజధనాన్ని అపహరించేందుకు ఆయా విభా గాల అధ్యక్షులు అవలంభించే మార్గాలను గురించి ఆచార్య చాణక్యుడు వివరించాడు.

ఇలాంటి మోసాలు జరిగినప్పుడు ఉపయుక్తుడిని (క్రిందిస్థాయి అధికారిని), నిధా యకుడిని (సామానులు భద్ర పరచే వాని ని), నిబంధకుడిని (నిబంధ లేదా గణాంక పుస్తకాలు జాగర్త చేసే వాడిని), తీసుకున్న వారిని, ఇచ్చిన వారిని, యుక్తుని (ఇప్పించిన వాడిని), సలహాదారుడిని, సలహా దారు కింద పనిచేసే వాడిని విడివిడిగా పిలిచి ప్రశ్నించి విచారించాలి.

ఇందులో ఎవరు అబద్ధాలాడినా యుక్తునికి ఏ శిక్ష విధిస్తారో వారికీ అదే శిక్ష విధించాలి. సం బంధిత ప్రాంతంలో విచారణ జరుపుతున్నట్లుగా చాటింపు వేయించి పౌరులను తమ అభియోగాలు చెప్పుకునేందుకు అ నుమతించాలి. అధికారిపై అభియోగం నిరూపితమైతే అతనిని తీవ్రంగా శిక్షించాలి. ఈ ప్రక్రియ అంతా వీలైనంత త్వర గా ముగించాలి.

నిజానికి అవినీతి లొసుగులు ఉన్న స్థలాలు తెలిస్తే వాటిని నిరోధించే ప్రయ త్నం చేయవచ్చు. తప్పు చేసిన వారిని శిక్షించడం అవసరమే కానీ, అది ఎలా, ఎక్కడ జరిగిందో తెలుసుకొని సరిచేయడం విజ్ఞత.

-పాలకుర్తి రామమూర్తి