calender_icon.png 16 August, 2025 | 8:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పశువుల కాపరి నుంచి డాక్టరేట్ స్థాయికి

10-08-2025 12:32:41 AM

-బడి బయటి నుంచి ఏడో తరగతికి ఎంట్రీ 

-పట్టుదలతో చదివి నేడు జియాలజీలో పీహెచ్‌డీ పట్టా 

-బడిఈడు పిల్లలకు స్ఫూర్తిగా నిలుస్తున్న కొండనాగుల పరమేశ్

ఏనాడు బడి గడప తొక్కలే.. పలకబలపం పట్టలే.. కుటుంబ భారాన్ని భుజాన వేసుకొని పశువుల కాపరిగా 14 ఏళ్లు చెట్లు గుట్టల వెంటే తిరిగాడు. కానీ నేడు జియాలజీలో పీహెచ్‌డీ పూర్తిచేసి ఎవరు ఊహించని విధంగా డాక్టరేట్ పట్టా పొందాడు.. అతనే కొండనాగుల పరమేశ్. దసరా పండుగ రోజున రంగురంగుల కొత్త బట్టల స్థానంలో స్కూల్ యూనిఫామ్ కుట్టించుకోవడమే అతడి జీవితాన్ని మలుపు తిప్పింది.

పశువుల కాపరిగా ఎక్కడో చెట్లు గుట్టల వెంట తిరిగాల్సిన ఆ యువకుడే నేడు ఎంతోమంది యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఎంవీఎఫ్ అనే స్వచ్ఛంద సంస్థ సంపూర్ణ సహకారంతో టెన్త్, ఇంటర్, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ ఇలా అంచలంచలుగా ఎదిగి నేడు జియాలజీ విభాగంలో ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా డాక్టరేట్ పట్టా పొందాడు. అతడి పేరే చింత పరమేశ్.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం కొండనాగుల గ్రామానికి చెందిన చింత తిరుపతమ్మ, మసయ్య దంపతుల రెండో సంతానమే పరమేశ్. కుటుంబ అవసరాల రీత్యా 14 ఏళ్ల వయసు వరకు పశువుల కాపరిగానే చెట్లు గుట్టల వెంట తిరుగుతూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉన్నాడు. అన్నతో పాటు తన ఇద్దరు తమ్ముళ్లు సైతం చదువుకోవడంతో తనకు చదువు పట్ల ప్రేమను పెంచుకున్నాడు.

కానీ చిన్ననాటి నుంచి ఏ రోజు పలక బలపం పట్టకుండా, ఓనమాలు దిద్దకుండా వయసు పెరగడంతో చదువుకోవడం ఎలా అని మదనపడుతూ పశువుల వెంటే తిరిగేవాడు. చదువు పట్ల ఇష్టం పెంచుకున్న పరమేశ్ దసరా పండుగకు కొత్త బట్టలు స్థానంలో స్కూల్ యూనిఫామ్ కొట్టించుకొని సంబరపడేవాడు. దసరా పండుగ రోజున గ్రామస్తులతో పాటు జమ్మిచెట్టు వద్దకు వెళ్లడంతో అక్కడ ఎంవీఎఫ్ ఫౌండేషన్‌లో పనిచేసే మౌలాలి అనే వ్యక్తి తనను చూసి ఏ స్కూల్ చిన్నా అంటూ పలకరించాడు.

తాను అసలు చదువుకోలేదని చెప్పడంతో యూనిఫామ్ మరెందుకు ధరించావని ప్రశ్నించాడు. చదువుకోవాలని ఇష్టమని, అందుకే స్కూల్ యూనిఫామ్‌ను కుట్టిం చుకున్నాని చెప్పడంతో ఒక్కసారిగా కంటనీరు తెచ్చుకొని తనను చేరదీశాడు. పెంట్లవెల్లి మండలం రాంపు రం వద్ద ఎంవీఎఫ్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన క్యాంప్ వద్ద ఓనమాలు దిద్ది మననూర్ గురుకుల పాఠశాలలో ఏడవ తరగతిలో ఎంట్రీ ఇచ్చాడు.

అనంతరం బల్మూరులోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి నుంచి 10వ తరగతిలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. అనంతరం కల్వకుర్తి గురుకుల జూనియ ర్ కళాశాలలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసి, హైదరాబాద్ సైఫాబాద్ సైన్స్ కాలేజీలో బీఎస్సీ జియాలజీలో చదువుకున్నాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ జియాలజీలో 85% మార్కులతో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడయ్యాడు.

పీజీలో ప్రతిభ కనబరిచిన పరమేశ్‌కు ఓయూలో పీహెచ్‌డీ సీటు లభించింది. రాజీవ్ గాంధీ నేషనల్ ఫెలోషిప్‌కు ఎంపిక కావడంతో అతడి పరిశోధన సాధనకు మద్దతు లభించింది. ఆచార్య మురళీధర్ మార్గదర్శకత్వంలో అమ్రాబాద్, పదర మండలాల్లో భూగర్భజల పరిస్థితులపై అధ్యయనం చేసి పీహెచ్‌డీ పట్టా అందుకున్నాడు.

ప్రస్తుతం ఒక ప్రైవేట్ సంస్థలో జియాలజిస్టుగా పనిచేస్తున్న పరమేశ్, ప్రొఫెసర్ అవ్వడమే తన లక్ష్యమని చెబుతున్నా డు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చి, ఎన్నో ఒడిదుడుకుల మధ్య విజేతగా నిలిచిన అతడి జీవితం ప్రతి యు వకుడికి స్ఫూర్తిదాయకంగా నిలిచేలా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతానని చెబుతున్నాడు. ప్రతి పాఠశాలలో అన్ని సబ్జెక్టుల మాదిరిగా ప్రతి విద్యార్థికి జీవిత పాఠా లు నేర్పేలా మోటివేషన్ టీచింగ్ సబ్జెక్ట్‌ను పొందుపరచాలని కోరుతున్నాడు.