09-08-2025 01:32:06 AM
-క్షేత్ర స్థాయిలో ఎరువులను -బ్లాక్ చేస్తున్న హోల్‌సేల్ వ్యాపారులు
-జిల్లా కేంద్రంగా భారీ దందా
-వత్తాసు పలుకుతున్న అధికారులు
మంచిర్యాల, ఆగస్టు 8 (విజయక్రాంతి) : వానా కాలం సీజన్ మొదటి నుంచే జిల్లాలో ఎరువుల కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. ఒకవైపు అధికారుల లెక్కల ప్రకారం ఎరువులు సరిపోయేంతగా ఉన్నాయని చూపుతుండగా.. అవి క్షేత్ర స్థాయిలో మాత్రం రైతుల కు చేరడం లేదు... దీనితో రైతులు యాబై, వంద రూపాయలు ఎక్కువ పెట్టి మరి కొనుగోలు చేస్తున్నారు. వీటికి అదనంగా లింక్ ప్రొడక్టులు పెట్టి విక్రయిస్తుండటంతో అవి రైతుల పాలిట భారమవుతున్నాయి.
జిల్లా రైతులను దోచుకునేందుకు వ్యాపారు లు సిండికేట్‌గా మారి ఎరువులను బ్లాక్ చేస్తున్నారు. అధికారులకేమో ఇంత ఉన్నాయి, అం త ఉన్నాయని చెబుతూనే రైతులకు మాత్రం ఇవ్వకుండా బ్లాక్ చేస్తున్నారు. ప్రధానంగా జిల్లా కేంద్రంతో పాటు చెన్నూర్, బెల్లంపల్లి, లక్షెట్టిపేట హోల్ సేల్ వ్యాపారులు సిండికేట్ గా మారి ఎరువులను బ్లాక్ చేస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలో హోల్ సేల్ వ్యాపారు లు యూరియా బస్తాను రూ. 350 విక్రయిస్తుండగా అవి భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, కోటపల్లి తదితర మండలాలకు వెళ్లినంక బస్తా రూ. 400పైనే అమ్ముతున్నారు. విజిలెన్స్ అధికారులు, వ్యవసాయ అధికారులకు వ్యాపారు లు ముందే ముడుపులు ముట్టజెబుతుండటంతో ఎలాంటి కేసులు నమోదు చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం.
ఎరువుల కృత్రిక కొరతే..
వ్యవసాయ శాఖ అధికారుల రికార్డులలో ఎరువులు ప్రస్తుతం సరిపోయేంతగా ఉన్నాయని అధికారిక రికార్డులు చూపుతుండగా అవి గ్రౌండ్ లెవల్లో మాత్రం అవి కనిపించడం లేదు. ఎరువుల కోసం లైన్లలో గంటల తరబడి నిలబడాల్సిన, కొట్టుకున్న పరిస్థితులను చూశాం. దీనికంతటికి ఎరువుల కృత్రిక కొరతే కారణంగా తెలియవస్తుంది. మొదట్ల యూరి యా పరిస్థితి మరీ దారుణంగా ఉండగా ప్రస్తుతం డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఎక్కడ చూసిన బస్తాకు రూ. 50 నుంచి రూ. 100 దండుకుంటున్నారు. వేరే జిల్లా నుంచి వాహనాల్లో తెప్పించాం, ఎక్కువ చెల్లిస్తేనే ఎరువులు ఇస్తామని, లేదంటే మా వద్ద లేవని చెప్పడంతో అధిక ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన దుస్థతి ఏర్పడింది.
వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకా రం జిల్లాలోని రిటైలర్స్, హోల్ సేల్ డీలర్స్, మార్క్ ఫెడ్‌లలో సుమారు 10,389.942 మెట్రిక్ టన్నుల ఎరువులు ఉన్నట్లు లెక్కలు చూపిస్తున్నారు. జిల్లాలో సీ ఆర్ పీ (కమిషనర్ రిజర్వ్ పూల్) యూరియా 299.7 మెట్రిక్ టన్నులతో కలిపి 2218.767 మెట్రిక్ టన్నులు, డీఏపీ 1184.9 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 986.35 మెట్రిక్ టన్నులు, ఎన్‌పీకేఎస్ 5487. 58 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ 512.35 మెట్రిక్ టన్నులు ఉన్నట్లు ప్రకటిస్తున్నారు. ఇంత ఎరువులు ఉంటే రైతులు ఎక్కువ ధరకు బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారో అధికారులు ఆలోచించాలి.
లింక్ పెట్టి అమ్ముతున్న వ్యాపారులు
జిల్లా కేంద్రంలోని ఎరువుల హోల్ సేల్ వ్యాపారులు యూరియాను బ్లాక్ చేసి ఎక్కువ డబ్బులు చెల్లించిన వారికి విక్రయిస్తున్నారు. అదీ లింక్ (యూరియా కావాలంటే మరో ప్రోడక్టు అంటగట్టడం) ప్రొడక్ట్ తీసుకుంటేనే ఇస్తున్నారు. యూరియా, కాంప్లెక్స్ ఎరువులు కావాలంటే ఇతర కంపనీలకు సంబంధించిన ఎరువులు (నానో డీఏపీ, నానో యూరియా, సీఎంఎస్, సీవీడ్ ఎక్స్ ట్రాక్ట్ లాంటివి లేదా బయోప్రొడక్టులు) కొంటేనే ఇస్తున్నారు. దీని తో రిటైల్ వ్యాపారులు గ్రామాల్లో అమ్ముడుపోని, నాణ్యత లేని లింక్ ప్రొడక్టులకు పడ్డ ధర ను యూరియా, కాంప్లెక్స్ బస్తాలకు కలిపి రైతులకు అమ్ముతున్నారు. రైతులు తప్పనిసరి పరి స్థితుల్లో లింకుతోనైనా లేదా డబ్బులు ఎక్కువ చెల్లించి కొనాల్సిన దుస్థుతి జిల్లాలో ఏర్పడింది. అధికారులు హోల్ సేల్ వ్యాపారుల నుంచి ఏయే మండలాలకు పెద్ద ఎత్తున ఆర్ ఓ(బిల్లు)లు వెళ్లినయ్, వాటికి లింక్ గా ఏయే ప్రొడక్టులు వెళ్లాయో చూస్తే అర్థమవుతుంది.
జిల్లా కేంద్రం అడ్డాగా.. భారీ దందా...
జిల్లా కేంద్రం అడ్డాగా పెద్ద ఎత్తున అవినీతి దందా కొనసాగుతుంది. ఆయా కంపనీల ప్రొడక్టులు అమ్మేందుకు యూరియా, కాంప్లె క్స్ ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రిటైల్ వ్యాపారులకు కంపెనీల నుంచి నేరుగా యూరియా రాదు, దీనిని ఆసరాగా చేసుకొని లింకులు పెడుతూ అమ్మకాలు జరుపుతున్నా రు. పనికిరాని ప్రొడక్టులు అంటగడుతూ దం డుకుంటున్నారు. మరోవైపు నాసిరకం ప్రొడక్టులు అమ్మినందుకు సదరు కంపనీ వారు ఇండియాలోని ఊఠీ, గోవా, తదితర ప్రాంతాలతో పాటు థాయ్ లాండ్, చైనా, సింగాపూర్, మాల్దీవులు, అండమాన్ తదితర ప్రాంతాలకు తీసుకువెళ్లడం, పార్టీలు ఇస్తుండటంతో వారి జల్సాలకు రైతులపై భారం మోపుతున్నారు. ఈ లింకుల పర్వం సంబంధిత శాఖ అదికారులకు తెలిసే జరుగుతుంది. ఆయా మండలాల అసోసియేషన్ ల నాయకులు, జిల్లా నాయకులు అధికారులను మేనేజ్ చేస్తుండటంతో చేతులు కట్టుకొని ఉంటున్నారు.
కృత్రిమ కొరత సృష్టిస్తే చర్యలు తప్పవు -
ఎరువుల కృత్రిమ కొరత సృష్టిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవు. హోల్ సేల్ ఎరువుల వ్యాపారులు ఎరువులను లింక్ పెట్టి అమ్మితే తమకు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. గత ఏడాది జూలై నెలాఖరు వరకు 12,508 మెట్రిక్ టన్నులు తీసుకువస్తే ఈ ఏడాది 15,077 మెట్రిక్ టన్నులు తెప్పించాం. రైతులు సైతం ఎకరాకు ఒకటి వాడాల్సింది రెండు, మూడు బస్తాలు వాడటం కూడా కాస్త ఇబ్బంది అవుతుంది. రైతులకు విడుతల వారిగా తీసుకోవాలని చెప్పినా ఒకే సారి పదుల సంఖ్యలో బస్తాలు తీసుకోవడం వల్ల కూడా షార్టేజి ఏర్పడుతుంది. ఏది ఏమైనా రైతులను మోసం చేసినా, లింక్ ప్రొడక్టులు పెట్టి ఇబ్బంది పెట్టినా షాపులను సీజ్ చేస్తం.
చత్రు నాయక్, జిల్లా వ్యవసాయ అధికారి, మంచిర్యాల