09-08-2025 01:33:43 AM
- ఏప్రిల్ నుంచి సన్న బియ్యం పంపిణీ...
- రేషన్ షాపుల్లో నిలువలపై దృష్టి సారించని అధికారులు
- బియ్యం అమ్మితే శాఖపరమైన చర్యలు అదనపు కలెక్టర్
మంచిర్యాల, ఆగస్టు 8 (విజయక్రాంతి): ఈ ఏడాది మార్చి నెల వరకు దొడ్డు బి య్యం పంపిణీ చేసిన పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏప్రి ల్ నెల నుంచి తెల్ల రేషన్ కార్డుదారులకు ‘ఉచిత సన్న బియ్యం పంపిణీ పథకం’ ప్రారం భించి ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తున్నారు. వానా కాలాన్ని దృష్టి లో పెట్టుకొని మూడు (జూన్, జూలై, ఆగ స్టు) నెలల బియ్యం ఒకేసారి పంపిణీ చేయాలనే నిర్ణయంతో స్థలాభావం వలన రేషన్ డీలర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సన్న బియ్యం పంపిణీ మొదలు చేసిన అధికారులు దొడ్డు బియ్యం నిలువలపై దృష్టి సారించకపోవడంతో ఎక్కడి నిలువలు అక్క డే మూలుగుతున్నాయి. మరోవైపు రేషన్ దుకాణాలలో దొడ్డు బియ్యం ఉన్నాయా? అమ్ముకున్నారా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్టాకులో తేడాలుంటే.., ఎం ఎల్‌ఎస్ పాయింట్‌లలోని బియ్యానికి ఇంచార్జీ, రేషన్ దుకాణాలకు డీలర్ బాధ్యత వహించాల్సి ఉంటుంది.
ఈ-పాస్ మిషన్ లెక్కల ప్రకారం జిల్లాలోని 423 రేషన్ దుకాణాలలో 5,315.03 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిలువలున్నాయి. కానీ క్షేత్ర స్థాయిలో దొడ్డు బియ్యం ఉన్నాయా, లేవా అనేది అధికారుల పరిశీలనలో తేలనుంది. జిల్లాలో రేషన్ బియ్యం ఎఫ్‌ఎస్సీ దుకాణాలకు సరఫరా చేసేందుకు ఆరు మండల్ లెవల్ స్టాక్ (ఎంఎల్‌ఎస్) పాయింట్‌లు ఉన్నాయి.
జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లోని రేషన్ దుకా ణాలకు లక్షెట్టిపేట ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి, మంచిర్యాల ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి మంచిర్యాల, నస్పూర్, జైపూర్, హాజీపూర్, మందమర్రి మండలాలకు, తాండూర్ నుంచి తాండూ రు, భీమిని, కన్నెపల్లిలకు, బెల్లంపల్లి నుంచి కాసిపేట, బెల్లంపల్లి, నెన్నెలకు, చెన్నూర్ నుంచి భీమారం, చెన్నూర్‌లకు, కోటపల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి కోటపల్లి, వేమనపల్లి మండలాల్లోని రేషన్ దుకాణాలకు సరఫరా చేస్తుంటారు. సన్న బియ్యం పంపిణీ ప్రారంభం కావడంతో లక్షెట్టిపేట ఎంఎల్‌ఎస్ పాయింట్ లో 39 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిలువ ఉండగా, మంచిర్యాలలో 103 మెట్రిక్ టన్నులు, తాండూరులో 50 మెట్రిక్ టన్నులు, బెల్లంపల్లిలో 36 మెట్రిక్ టన్నులు, చెన్నూరులో 32 మెట్రిక్ టన్నులు, కోటపల్లి ఎంఎల్‌ఎస్ పాయింట్ లో 53 మెట్రిక్ టన్నుల ధాన్యం మిగిలిపోయింది. ఇలా ఆరు ఎంఎల్‌ఎస్ పాయింట్లలో 313 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంది.
ముక్కిపోతున్న బియ్యం...
రేషన్ దుకాణాలలో నాలుగు నెలలుగా, కొన్నింటిలో గతంలో పంపిణి చేయగా మిగిలిపోయిన దొడ్డు బియ్యం నిలువలు ఉండటంతో డీలర్లకు అవస్థలు తప్పడం లేదు. నిలువల కారణంగా పురుగులు పట్టడం, అవి ప్రస్తుతం పంపిణీ చేసే సన్న బియ్యం బస్తాలకు పట్టే అవకాశం ఉందని డీలర్లు వాపోతున్నారు. మరో వైపు వర్షా కాలం కారణంగా తడిచి త్వరగా ముక్కిపోయి చెడిపోయేటట్లు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాధనం సైతం వృథా అవుతుందని అధికారులపై విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి.
బియ్యం అమ్మితే శాఖపరమైన చర్యలు -
రేషన్ దుకాణాలలో మిగిలి ఉన్న బియ్యం అమ్మితే శాఖా పరమైన చర్య లు తప్పవు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు వేచి చూడాల్సిందే. జిల్లాలో మిగిలి ఉన్న దొడ్డు బియ్యాన్ని ప్రభుత్వం వేలం వేస్తుందా, వేరే అవసరాలకు ఉపయోగిస్తుందా అనే ఆదేశాలు ఇంత వరకు రాలేదు. ఉన్న నిలువలను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత రేషన్ డీలర్ ది, ఎంఎల్‌ఎస్ పాయింట్ ఇంచార్జీలదే.
చంద్రయ్య, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ), మంచిర్యాల