19-11-2025 12:25:26 AM
-ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి
-అప్పుడే పంచాయతీలకు రావాల్సిన రూ.4 వేల కోట్లు విడుదల సాధ్యం
-బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామనడం అన్యాయం
-కాంగ్రెస్ వైఫల్యాన్ని ఇతరులపై మోపడం సరికాదు
-బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): రాజ్యాంగంలోని 73వ, 74వ సవరణల ప్రకారం స్థానిక సంస్థలకు పాలకవర్గాలు ఉన్నప్పుడే 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్రం నుంచి విడుదలయ్యే అవకాశం ఉంటుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు తెలిపారు. తెలంగాణ రాష్ర్టంలో సర్పంచుల పదవీకాలం ముగిసి 21 నెలలు దాటినా, రాష్ర్ట ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో పాలకవర్గాలు లేకుండాపోయాయని పేర్కొన్నారు.
దీంతో పంచాయతీలకు రావాల్సిన దాదాపు రూ. 4,000 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయని తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో మీడియాతో రాంచందర్ రావు మాట్లాడారు. రాష్ర్టంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు కాంగ్రెస్ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా, కేవలం పార్టీ పరంగానే ఇస్తామన్న ధోరణి అన్యాయమన్నారు.
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీల ఓట్లు పొందడానికే ఉపయోగించుకుంది తప్ప- రిజర్వేషన్లు ఇవ్వడానికి న్యాయపరమైన చర్యలు మాత్రం తీసుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ వైఫల్యాన్ని ఇతర పార్టీలపై మోపడానికి ప్రయత్నించడం సరైనది కాదని, కనీసం ఇప్పుడైనా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని సూచించారు. భారతీయ జనతా పార్టీ తరఫున బీసీలకు పెద్దపీట వేస్తామని ఆయన చెప్పారు.
మావోయిస్టులు తుపాకులు వీడాలి
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ‘కగార్’ ద్వారా దేశంలో ఉగ్రవాదం, మావోయిస్టు చర్యలను నిర్మూలించే దిశగా నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటుందన్నారు. మావోయిస్టులు తుపాకీ వీడి జన జీవన స్రవంతిలో కలవాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టులు కొంతమంది దుష్టశక్తుల మాటలు నమ్మి సరెండర్ కాకుండా ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. తక్షణమే తుపాకీ వీడి, ప్రజల జీవితంలో కలవాలని ఆయన కోరారు.
పార్టీ బలోపేతంపై దృష్టి
-బీజేపీ ప్రధానకార్యదర్శులతో నేతల భేటీ
హైదరాబాద్, నవంబర్ 18 (విజయక్రాంతి): క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై బీజేపీ దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే మంగళవారం తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యదర్శులు, మోర్చా అధ్యక్షులతో పార్టీ తెలంగాణ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు సమావేశమయ్యారు. పార్టీ బలోపేతం, బూత్ స్థాయి నిర్మాణం, ప్రస్తుత కార్యాచరణ, ప్రణాళికలు, రాబోయే నెలల్లో చేపట్టాల్సిన వ్యూహాత్మక కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు. ప్రతి నేత, ప్రతి మోర్చా, ప్రతి కార్యకర్త లక్ష్యం వైపు నిబద్ధ్దతతో ముందుకు సాగాలని సూచించారు. పార్టీని గ్రామ స్థాయి నుంచి రాష్ర్ట స్థాయి వరకు మరింత బలోపేతం చేసే దిశగా నిరంతరం కృషి చేయనున్నట్లు ఎక్స్ వేదికగా వారు పేర్కొన్నారు.