19-11-2025 12:27:23 AM
- రాత్రి వేళలో కమలాపురం హాస్టల్ తనిఖీ
-ఎమ్మెల్యే జారే ఆదినారాయణ
ములకలపల్లి, నవంబర్ 18 (విజయ క్రాంతి): ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం ఆహార పదార్థాలను విద్యార్థులకు అందజేయకుండా అశ్రద్ధ వహిస్తే చర్యలు తప్పవని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ హెచ్చరించారు. ములకలపల్లి మండలంలోని కమలాపురం గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలను సోమవారం రాత్రి ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఉపాధ్యాయుల,విద్యార్థుల హాజరు రిజిస్టర్లను పరిశీలించారు.
విద్యార్థుల హాజరు రిజిస్టర్లలో విద్యార్థుల సంఖ్యకు, హాజరైన సంఖ్యకు ఉన్న తేడాలను గుర్తించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకొకసారి ఈ విధంగా జరిగితే కఠిన చర్యలు తప్పవని ఉపాధ్యాయ సిబ్బందిని వార్డెన్ ను హెచ్చరించారు. విద్యార్థుల కోసం వండిన ఆహార పదార్థాల రుచిని తనిఖీ చేసి అసహనం వ్యక్తం చేశారు. నాణ్యమైన రీతిలో అందజేయాలని చెప్పారు. విద్యార్థులతో మాట్లాడి ఆశ్రమంలో పెడుతున్న మెనూపై విద్యార్థుల నుంచి సమాచారానికి తీసుకున్నారు.
నాసిరకం కూరగాయలను వాడిన, మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించకపోయిన క్రమశిక్షణ చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. విద్య కోసం ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని సిబ్బంది కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడితే ఉపేక్షించేది లేదని పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను ఉపయోగించుకొని భవిష్యత్తులో వృద్ధిలోకి రావాలని ఉన్నత ఉద్యోగాలను సాధించాలని సూచించారు. మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.