calender_icon.png 12 July, 2025 | 3:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రాథమిక సహకార సంఘాలు మరింత బలోపేతం

27-05-2025 12:00:00 AM

  1. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 
  2. వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డితో సమావేశం
  3. ఇప్పటివరకు 71, 535 క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): ప్రాథమిక సహకార సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మట్టి నమూనా ఫలితాలు ప్రతీ రైతుకు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సోమవారం వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మంత్రి తుమ్మలతో  రైతు సమస్యలపై చర్చించారు.

ఆ తర్వాత రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం అమలుపై వ్యవసాయ శాఖ డైరెక్టర్ గోపిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నెల 29 నుంచి జూన్ 12 వరకు  నిర్వహించ తలపెట్టిన ‘ వికసిత్ కృషి సంకల్ప్ అభియాన్ ’ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని మంత్రి సూచించారు .  ప్రతి రెవెన్యూ గ్రామంలో ఎంపిక చేసిన ముగ్గురు రైతులకు మూల విత్తనాన్ని  సరఫరా చేయాలని, రైతు పొలాలను కూడా నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి తుమ్మల ఆదేశించారు.  

రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు సరఫరా 

రైతులకు పచ్చిరొట్ట విత్తనాలను ప్రభు త్వం సరఫరా చేస్తోందని వ్యవసాయ శాఖ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ సీడ్ కార్పోరేషన్‌కు 9 వేల క్వింటాళ్లు, నేషనల్ సీడ్ కార్పోరేషన్‌కు 4 వేల క్వింటాళ్లకు ఇండెంట్ ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలోని 32 జిల్లాలకు గాను 20 జిల్లాల్లో తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ద్వారా, 12 జిల్లాలకు నేషనల్ సీడ్ కార్పొరేషన్ ద్వారా పచ్చిరొట్ట విత్తనాలను సరఫరా చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు.

టీజీ సీడ్ కార్పొరేషన్ ఇప్పటి వరకు 71,535 క్వింటాళ్లు తెప్పించి రైతులకు సరఫరా చేయడం ప్రారంభించినట్లు తెలిపారు. నేషనల్ సీడ్ కార్పొరేషన్ కేటాయించిన 4 వేల క్వింటాళ్లలో కేవలం వెయ్యి క్వింటాళ్లే సరఫరా జరిగినట్లు తెలిపారు. 

విత్తన చట్టంపై ఇతర రాష్ట్రాల్లోనూ అధ్యయనం 

నకిలీ విత్తాలను అరికట్టడం, నకిలీ విత్తానాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం విత్తన చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందుకు రైతు విత్తన కమిటీని నియమించింది. ఈ మేరకు విత్తణ కమిటీ చైర్మన్ గోపి అధ్యక్షతన సోమవారం బీఆర్కే భవన్‌లోని  రైతు కమిషన్ కార్యాలయంలో సమావేశం జరిగింది.

ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్న విత్తన చట్టాలను అధ్యయనం చేయడంతో పాటు తెలంగాణలోని రైతుల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుని సమగ్ర విత్తన చట్టం రూపొందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటీ వరకు ఉన్న చట్టాల్లోని లోపాలపైన చర్చించారు.

గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సమావేశాలు నిర్వహించి విత్తన ముసాయిదాను రూపొందించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సీడ్ కార్పోరేషన్ చైర్మన్  అన్వేష్‌రెడ్డి, కమిషన్ సభ్యులు సునీల్, శ్రీనివాస్‌రెడ్డి, అధికారులు శివప్రసాద్, ఎంపీ నగేష్ పాల్గొన్నారు.