12-07-2025 03:06:35 PM
బిసిలకు రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు
కామారెడ్డి బిసి డిక్లరేషన్ లో పేర్కొన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు
దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
దేవరకొండ: స్థానిక ఎన్నికలను వాయిదా వేయడానికే బిసిలకు రిజర్వేషన్ డ్రామా అని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం దేవరకొండ పట్టణంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బిసిలకు రిజర్వేషన్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు అని ఆయన అన్నారు.కామారెడ్డి బిసి డిక్లరేషన్ లో పేర్కొన్న ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అని ఆయన గుర్తు చేశారు. బిసి ఉపకులాల వర్గీకరణ ఊసే లేదు అని తెలిపారు.ఎంబిసి లకు మంత్రి వర్గం ఏర్పాటు ఏమైంది అని అడిగారు.
బీసీ బిల్లు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ఘరానా మోసం చేస్తుంది. అఖిలపక్షం పెట్టకుండా ఏకపక్షంగా చేయడం బీసీలను అన్యాయం చేయడమే అని ఆయన అన్నారు.బిల్లు ఆమోదం కోసం కేంద్రం వద్ద రేవంత్ ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేయలేదు అని ఆయన తెలిపారు.గతంలో రాజస్థాన్, కేరళ, బీహార్ లో ఇలాంటి జీఓలు ఇస్తే కోర్టుల్లో నిలబడలేదు అని ఆయన తెలిపారు.తొమ్మిదో షెడ్యూల్ లో పెట్టకుండా 70 శాతం రిజర్వేషన్లు ఎలా అమలవుతాయి? 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్దత కల్పించాలి. అప్పటివరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదు అని ఆయన డిమాండ్ చేశారు.తెలంగాణలో 20 నెలలు గడుస్తున్నా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా బీసీలను మోసం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు.
కేంద్ర ప్రభుత్వం చట్టం చేస్తే బీసీ రిజర్వేషన్ అమలవుతుందని రేవంత్ రెడ్డికి కూడా తెలుసని, అయినారాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తో బీసీ రిజర్వేషన్లు ఎలా సాధ్యమన్నారు. తెలంగాణలో ఇప్పటికే 56 శాతం రిజర్వేషన్లు అమలులో వుంది. బీసీ డిక్లరేషన్ సభలో బిజెపి గానీ కేంద్ర ప్రభుత్వం పేరు ఎత్తకుండా.. సుప్రీం కోర్టు గోడలు బద్దలు కొట్టి అయినా బీసీ రిజర్వేషన్లు తెస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేస్తూ బీసీలను మోసం చేస్తుందన్నారు. తెలంగాణ బిసి ప్రజలు, బీసీ మేధావులు అన్నీ గమనిస్తున్నారు. బీసీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు.
ఎంబిసిలకు మంత్రిత్వ శాఖ కేటాయిస్తామని, బిసిలలో ఉప కులాలకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పిన కాంగ్రెస్ పార్టీ... ఇవి కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు కదా..ఇది చేయలేని రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల కపట నాటకం ఆడుతూ పాలాభిషేకాలు చేసుకోవడం ఎంతవరకు సబబమని విమర్శించారు. ఏం సాధించారని పాలాభిషేకాలు చేసుకుంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడానికి రేవంత్ అమలుకు సాధ్యం కానీ విధంగా నడుచుకుంటూ బీసీ రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ విమర్శించారు.