calender_icon.png 7 May, 2025 | 10:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సినిమాలకే గద్దర్ అవార్డులివ్వాలి

04-05-2025 12:35:30 AM

  1. ఫిలిం ఛాంబర్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలి
  2. తెలంగాణ సినిమా వేదిక డిమాండ్

ముషీరాబాద్, మే 3 (విజయక్రాంతి) : తెలంగాణ సినిమాలకే గద్దర్ అవార్డులివ్వాలని తెలంగాణ సినిమా వేదిక (టీసీవీ) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అలాగే ఫిలిం ఛాంబర్ లో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో తామే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకుంటామని వెల్లడించింది.

శనివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీయూ జేఏసీ సెక్రటరీ జనరల్ తుమ్మల ప్రఫుల్ రాం రెడ్డితో కలిసి టీసీవీ కన్వీనర్ లారా, కో-కన్వీనర్ మోహన భైరాగిలు మాట్లాడారు. తెలంగాణ సినిమా అభివృద్ధి లక్ష్యంగా టీసీవీ ఆవిర్భవించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ సినిమా పాలసీని ప్రకటించాలని కోరారు.

తెలంగాణ సినిమాలకే గద్దరన్న అవార్డులు ఇవ్వాలన్నారు. ఆంధ్ర సినిమాలకు గద్దరన్న అవార్డులు ప్రకటిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వం చిన్న సినిమాలను ఆదుకోవాలని, తెలంగాణ సంస్కృతిక సాంప్రదాయాల రక్షణ కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సినిమా రంగంలో ఆంధ్ర ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

తెలంగాణ సినిమా, జానపద అనేక కళా రంగాల్లో తెలంగాణ వెనుకబడి ఉందని వివరించారు. కడుపు మాడ్చుకొని కళా నైపుణ్యంతో నటనను నమ్ముకుని ఫిలింనగర్ లో వీధుల వెంట తిరుగుతున్న తెలంగాణ యువతకు సినిమా అవకాశాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ సినిమా కళాకారులకు పెన్షన్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.