calender_icon.png 22 December, 2025 | 6:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాదె ఇన్నయ్యకు 14 రోజుల రిమాండ్

22-12-2025 02:40:41 AM

నాంపల్లి కోర్టులో హాజరు.. చంచల్‌గూడ జైలుకు తరలింపు

మావోయిస్టులకు మద్దతుగా ప్రసంగాలే కారణమా?

హైదరాబాద్ సిటీబ్యూరో/మహబూబాబాద్, డిసెంబర్ 21 (విజయక్రాంతి): మావో యిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ప్రముఖ సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్య అలియాస్ ఇన్నారెడ్డిని ఎన్‌ఐఏ పోలీసులు ఆదివారం అరెస్ట్‌చేశారు. హైదరాబాద్ నుంచి ఎన్‌ఐఏ డీఎస్పీ రాహుల్ తేజ ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీసు బృందం జనగామ జిల్లా జఫర్గడ్ మండలం రేగడితండాలోని ‘మా ఇల్లు ప్రజాదరణ’ కేంద్రానికి వచ్చి ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ, ప్రజలను రెచ్చగొడు తున్నారన్న అభియోగాల కింద ఆయనపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కింద కేసు నమోదు చేశారు.

ఆయనను నాంపల్లిలోని ఎన్‌ఐఏ కోర్టులో హాజ రుపరచగా న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇటీవల మరణించిన మావోయిస్టు కీలక నేత కాతా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియలకు గాదె ఇన్నయ్య హాజరయ్యారు. ఆ సమయంలో మావోయిస్టులకు అనుకూలంగా నినాదాలు చేస్తూ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను ప్రేరేపించేలా వ్యాఖ్యలు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ పరిణామాలను సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఇన్నయ్యను అదుపులోకి తీసుకున్నారు. మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత గాదె ఇన్నయ్య ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లినట్టు సమాచారం.

అక్కడ హిడ్మా తల్లిని కలిసి పరామర్శించడమే కాకుండా, మీడియా ముందు మాట్లా డుతూ.. తీవ్ర భావోద్వేగానికి గురయ్యారని, అదే సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తీరును తప్పుబడుతూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారని ఎన్‌ఐఏ ఆరోపిస్తోంది. ఇన్నయ్య కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ కొంతకాలంగా నిఘా పెట్టింది. మావోయిస్టు సానుభూతిపరునిగా వ్యవహరిస్తు న్నారన్న అనుమానంతో గతంలోనే పలుమార్లు నోటీసులు కూడా జారీ చేసింది. తాజాగా వికల్ప్ అంత్యక్రియల ఘటన, పాత కేసులను పరిగణనలోకి తీసుకుని ఆయనపై ఉపా చట్టం ప్రయోగించి అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.