calender_icon.png 29 December, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్ని ఫార్మాట్లకూ గంభీరే కోచ్

29-12-2025 12:00:00 AM

స్పష్టం చేసిన బీసీసీఐ

ముంబై, డిసెంబర్ 28 : గత ఏడాదిన్నర కాలంగా టెస్ట్ క్రికెట్‌లో టీమిండియా ఆటతీరు ఏమాత్రం బాగాలేదు. ముఖ్యంగా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పలు ఘోర పరాజయాలు ఎదురయ్యాయి. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అద్భుత ఫలితాలు సాధిస్తున్న గంభీర్ రెడ్ బాల్ క్రికెట్‌లో మాత్రం పేలవ ఫలితాలను ఎదుర్కొన్నాడు. ఈ కారణంగానే అతన్ని టెస్ట్ ఫార్మాట్ కోచ్‌గా తప్పించబోతున్నట్టు, వీవీఎస్ లక్ష్మణ్‌తో బీసీసీఐ చర్చలు జరిపినట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ వార్తలపై బీసీసీఐ స్పందించింది. వీటిలో ఎలాంటి వాస్తవం లేదని బీసీసీఐ సెక్రటరీ దేవజీత్ సైకియా స్పష్టం చేశారు. గంభీర్‌ను మారుస్తున్నారంటూ వచ్చిన కథనాలన్నీ పుకార్లేనని తెలిపారు.

ఎంతో ఆలోచించిన తర్వాతే బీసీసీఐ ఏ నిర్ణయమైనా తీసుకుంటుందని చెప్పారు. కాంట్రాక్ట్ ప్రకారమే గంభీర్ కోచ్‌గా కొనసాగుతాడని వెల్లడించారు. 2027 వన్డే ప్రపంచకప్ వరకూ గంభీర్‌తో కాంట్రాక్ట్ ఉందనీ, అప్పటి వరకూ కోచ్ పదవిలో ఎలాంటి మార్పులు ఉండవని సైకియా తేల్చి చెప్పారు. అసలు ఇలాంటి పుకార్లు ఎలా వస్తాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. ఇలాంటి పుకార్లు వచ్చినప్పుడు బీసీసీఐ నుంచి క్లారిటీ తీసుకుని ప్రచురించాలని సూచించారు.

సైకియా స్టేట్‌మెంట్‌తో కోచ్‌గా గంభీర్ మార్పుపై వస్తున్న వార్తలకు తెరపడింది. కాగా గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏడాది కాలంలో భారత్ సొంతగడ్డపైనే రెండుసార్లు వైట్ వాష్ పరాభవానికి గురైంది. న్యూజిలాండ్ చేతిలో 0 తో వైట్‌వాష్ అయింది. అలాగే ఈ ఏడాది సౌతాఫ్రికా చేతిలో 0 ఓడిపోయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని సైతం చేజార్చుకుంది. ఈ ఫలితాలతోనే టెస్ట్ కోచ్‌గా గంభీర్‌ను తప్పించాలన్న డిమాండ్ మొదలైంది. అయితే కాంట్రాక్ట్ పూర్తయ్యే వరకూ గంభీరే కోచ్‌గా కొనసాగుతాడని బీసీసీఐ మరోసారి క్లారిటీ ఇచ్చింది.