calender_icon.png 13 October, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గాంధీజీ విద్యాసంస్థల నుండి గాంధీజీ లక్ష విగ్రహాల సేకరణ కార్యక్రమం ప్రారంభం

13-10-2025 06:31:19 PM

చండూరు (విజయక్రాంతి): గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ స్వర్ణోత్సవాల సందర్భంగా నల్లగొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ కేంద్రంలోని గాంధీజీ విద్యాసంస్థలలో "గాంధీజీ లక్ష విగ్రహాల సేకరణ" కార్యక్రమాన్ని గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ వైస్ చైర్మన్ డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులుతో కలిసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొట్ట మొదటగా గాంధీజీ విద్యాసంస్థల నుండి పది విగ్రహాలకు గాను 15 వేల రూపాయలు అందించి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని, దానికి గాంధీ సంస్థల నిర్వాహకులు గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులుకి ప్రత్యేక అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఇక్కడి నుండి ప్రారంభించి, ప్రతి మండల, జిల్లా కేంద్రాలలో గాంధీజీ విగ్రహాల తయారీకి అవసరమైన ఆర్థిక వనరులను సమీకరించి, లక్ష విగ్రహాల రూపొందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ విగ్రహాలన్నింటినీ హైదరాబాదులో నిర్వహించే ప్రత్యేక ప్రదర్శన కార్యక్రమంలో ప్రజలకు అందుబాటులో తీసుకొస్తామని అన్నారు. గతంలో మహాత్మా గాంధీ సిద్ధాంతాలు, అవగాహన సదస్సులు, గాంధీజీ వేషధారణ కార్యక్రమం పేరిట గాంధీజీ నడక, నడవడిక వంటి విభిన్న కార్యక్రమాలు కూడా ఇదే ప్రాంతం నుండి ప్రారంభించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు"లో స్థానములో చోటు సాధించి, అదే స్ఫూర్తితో ఇది మాకు సెంటిమెంట్ గా భావించి "గాంధీజీ లక్ష విగ్రహాల సేకరణ "కార్యక్రమాన్ని ఇక్కడి నుండి ప్రారంభిస్తున్నామని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో గాంధేయవాదులు, ప్రకృతి ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రతి ఒక్క సామాన్య పౌరుడు ఆర్థికంగా, నైతికంగా మద్దతు ఇవ్వాలని కోరారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం స్వదేశీ, స్వాలంబన, స్వాభిమానంతో కూడిన జీవితం సాధించే దిశగా ఇది ఒక ముఖ్యమైన అడుగని, ఈ స్ఫూర్తిని మన ప్రస్తుత తరానికి రానున్న యువతకు చేరవేసే విధంగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలని, గాంధీజీ విజ్ఞానాన్ని ఈ ఉద్యమం ద్వారా సుస్థిర అభివృద్ధి, శాంతి, నైతిక విలువలు, సామాజిక సంఘీభావం బలోపేతం కావడానికి, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రపంచంలోనే గాంధీజీ ఎత్తైన విగ్రహం ఏర్పాటు చేసి గాంధీజీ విజ్ఞానాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి చేస్తున్న కృషికి సంఘీభావంగా ఈ లక్ష విగ్రహాల కార్యక్రమం చేపట్టినట్లు సంస్థల వైస్ చైర్మన్ డాక్టర్ యానాల ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, ట్రస్మా ప్రధాన కార్యదర్శి జి.వి. రావు,రాష్ట్ర నాయకులు పుచ్చకాయల వెంకటరెడ్డి, ట్రస్మా చండూరు, నార్కట్ పల్లి మండల అధ్యక్షులు గొట్టిపర్తి చంద్రశేఖర్, అశోక్ ,పల్లె శ్రీనివాస్ గౌడ్, శిరంశెట్టి శ్రీధర్ బాబు, సరికొండ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.