03-09-2025 07:44:21 PM
హనుమకొండ (విజయక్రాంతి): గాంధీనగర్ స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని సిపిఎం సీనియర్ నాయకులు తొట్ల మల్లేశం(Senior CPM leaders Thotla Mallesham) అన్నారు. ప్రజా సమస్యల అధ్యయన యాత్రలో భాగంగా సిపిఎం పార్టీ ఖాజీపేట మండల ప్రతినిధి బృందం బుధవారం దర్గా గాంధీనగర్ స్మశాన వాటికను సందర్శించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు తొట్టె మల్లేశం మాట్లాడుతూ, దర్గా గాంధీనగర్ దళితులకు సంబంధించిన స్మశాన వాటిక చాలా అధ్వానంగా ఉందని 500 కుటుంబాలు గల ఈ స్మశాన వాటికకు రోడ్డు సౌకర్యం లేక వర్షాకాలంలో మొత్తం నీళ్లు బురదతో ఉండి కనీసం నడవడానికి కూడా వీలు లేకుండా ఉందని, స్మశాన వాటికలో మొత్తం తుమ్మ చెట్లు ముళ్ళ పొదలు పెరిగి చాలా ఇబ్బందికరంగా మారిందని, ప్రహరీ గోడ లేకపోవడం వలన పందులు, కుక్కలు అస్మశాన వాటికలో ఆవాసం ఏర్పరచుకుంటున్నాయని, మహిళలు స్నానం చేయడానికి స్నానపు గదులు నిర్మించాలని, నీటి సౌకర్యం కల్పించాలని, ఒక బోరు వేసి ట్యాంకు కట్టి నిత్యం నీరు అందుబాటులో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
ప్రతి మున్సిపల్, ఎమ్మెల్యే ఎలక్షన్లలో ఈ స్మశాన వాటికను అభివృద్ధి చేస్తామని అనేకమంది నాయకులు, రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసిన ఎన్నికలు అయిపోయాక వీటిని ఎవరు పట్టించుకోకపోవడం వలన ఈ స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోవడం లేదని, గతంలో సిపిఎం పార్టీగా స్థానిక ప్రజా ప్రతినిధులకు, అధికారులకు అనేకసార్లు ఈ స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని వినతి పత్రాలు ఇచ్చిన హామీ ఇచ్చారు గాని సమస్య పరిష్కారం కావడం లేదని, వెంటనే అధికారులు స్పందించి ఈ స్మశాన వాటికను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని లేనిచో సిపిఎం పార్టీ కాజీపేట మండల కమిటీ ఆధ్వర్యంలో గాంధీనగర్ వాసులందరినీ ఐక్యం చేసి ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓరుగంటి సాంబయ్య, జంపాల రమేష్, గద్దల బద్రి, మేక మల్ల బాబు పాల్గొన్నారు.