03-09-2025 07:44:29 PM
మహదేవపూర్,(విజయక్రాంతి): మహాదేవపూర్ మండల కేంద్రంలోని టస్సర్ కాలనీలో పర్యటించిన దౌత్యధి కారుల బృందం టస్సర్ పట్టు వస్త్రాలకు మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలో టస్సర్ కాలనీలో పట్టు వస్త్రాలు నేస్తున్న నేతన్నల కుటుంబాలను, ఆ పట్టు వస్త్రాలు నేసే ప్రక్రియను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా దౌత్యాధి కారులు శ్రీకర్ రెడ్డి, రాము అబ్బా గాని మాట్లాడుతూ పట్టు వస్త్రాలు మార్కెటింగ్ సౌకర్యం కల్పన కు చర్యలు తీసుకోవాలని సూచించారు. హైదరాబాదులోని శిల్పారామం లో పట్టు వస్త్రాల విక్రయానికి అనుగుణంగా ఈ స్టాల్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పట్టు వస్త్రాలను ఆన్లైన్ ద్వారా విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఇక్కడ నేస్తున్న పట్టు వస్త్రాలను టెస్కో ద్వారా విక్రయాలకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పట్టు గుడ్ల నుండి దారం తీస్తున్న తీరును వస్త్రాలు నేస్తున్న విధానాన్ని ఎంతో ఆసక్తిగా వీక్షించి నేతన్నలను అభినందించారు. పట్టు వస్త్రాలకు మంచి డిమాండ్ ఉందని అన్ని సమస్యలు అధిగమిస్తూ అవకాశం అందిపుచ్చుకుంటూ వ్యాపారవేత్తలు గా ఎదగాలని ఆకాంక్షించారు.