calender_icon.png 26 August, 2025 | 7:26 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైభవోపేతంగా, ప్రశాంతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణ

26-08-2025 01:06:25 AM

ఖమ్మం, ఆగస్టు-25 (విజయ క్రాంతి): వైభవోపేతంగా, ప్రశాంతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. జిల్లా కలెక్టర్, కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వినాయక చవితి సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ, కల్లూరు డివిజన్ సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్ లతో కలిసి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, వైభవోపేతంగా జరగాలని అన్నారు. వినాయక చవితి నుంచి నిమజ్జనం వరకు ఉత్సవాలు ఘనంగా జరిగేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అన్నారు. ట్రాఫిక్ నియంత్రణ, గణేష్ మండపాలకు విద్యుత్ సరఫరా, నిమజ్జనం పాయింట్ల వద్ద ఏర్పాట్లు తదితర అంశాల్లో మంచి ఏర్పాట్లు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అన్నారు.

నవరాత్రి వేడుకల సందర్భంగా ఖమ్మం జిల్లాలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.గణపతి విగ్రహాల తరలింపు సమయంలో ఎక్కడా విద్యుత్ షాక్ గురికాకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. విద్యుత్ మండపాల వద్ద షార్ట్ సర్క్యూట్ కాకుండా ఏర్పాట్లు చేయాలని, ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటించాలని, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీసు అధికారులతో పూర్తి స్థాయిలో సహకరించాలని కలెక్టర్ కోరారు.

ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ నిమజ్జనం రోజు ఊరేగింపు కార్యక్రమం, చివరి పూజ సూ ర్యాస్తమం కంటే ముందే సాయంత్రం 4.00 గంటల ప్రాంతంలో ప్రారంభించాలని ఉత్సవ కమి టీ సభ్యులను కోరారు. నిమజ్జనం నాడు విగ్రహం తరలించే వాహనాలు ముందుగా బుక్ చేసుకోవాలని, విగ్రహం తరలించే రూట్ మ్యాప్ ఫైనల్ చేసుకోవాలని అన్నారు.

ఈ సమావేశంలో డి.ఆర్.ఓ. ఏ. పద్మ శ్రీ, టీజీ ఎన్పిడిసిఎల్ ఎస్‌ఇ శ్రీనివాసా చారి, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, సహాయ ఎక్సైజ్ పర్యవేక్షకులు వి. వేణుగోపాల్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కళావతి బాయి, జిల్లా అగ్నిమాపక అధికారి అజయ్ కుమార్, ఇరిగేషన్ అధికారి వెంకట్రామ్, జిల్లా రవాణా అధికారి వెంకట రమణ, ఆర్ అండ్ బి ఇఇ పవార్, ఖమ్మం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ అనిల్ కుమార్, ఎఫ్.ఆర్.ఓ. నాగేశ్వర రావు, ఈఈ పంచాయతీ రాజ్ యు. మహేష్ బాబు, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రవీందర్, మున్సిపల్ కమీషనర్లు, తహశీల్దార్లు, స్థంభాద్రి గణేష్ ఉత్సవ కమిటి వర్కింగ్ ప్రెసిడెంట్ విద్యాసాగర్, కార్యదర్శి జైపాల్ రెడ్డి, కన్వీనర్ ప్రసన్న కృష్ణ, ఉత్సవ కమిటీ సభ్యులు సాయి కిరణ్, అధికారులు, తదితరులుపాల్గోన్నారు.