calender_icon.png 26 August, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారామ ప్రాజెక్టు నీటిని మూకమామిడి ప్రాజెక్టుకు తరలించాలి

26-08-2025 01:04:26 AM

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని డిమాండ్

ములకలపల్లి, ఆగస్టు 25 ( విజయ క్రాంతి):సీతారామ ప్రాజెక్టు పాత డిజైన్ ప్రకారం మూక మామిడి ప్రాజెక్టును నింపి చివరి ఆయకట్టు రైతుల వరకు సాగునీరు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ డిమాండ్ చేశారు. సోమవారం మండలలోని మూక మామిడి ప్రాజెక్టు ను సిపిఎం బృందం సందర్శించింది. అక్కడ ఉన్న ఆయకట్టు రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోనే ఏకైక సాగునీటి ప్రాజెక్టుగా పేరు గాంచిన మూకమామిడి ప్రాజెక్ట్ నేటికీ నిర్మాణం పూర్తి అయి 46 సంవత్సరాలు కావస్తున్న పాలకులకు ఇక్కడి రైతాంగ కష్టాలు కనిపించడం లేదని ఆరోపించారు. మూకమామిడి ప్రాజెక్ట్ కింద 3,360 ఎకరాల ఆయకట్టు, సుమారు 15 గ్రామాల రైతాంగం ఈ ప్రాజెక్టు పై ఆధారపడి పంటలు సాగు చేసుకుంటున్నారని తెలిపారు.

చివరి ఆయకట్టు రైతుల వరకు సాగునీరు అందక రైతులు వేసుకున్న పంటలు సగం పంట కాలంలోనే ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ కాలంలో మూకమామిడి ప్రాజెక్టుకు తొమ్మిది కోట్ల నిధులు మంజూరయ్యాయని పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిధులు అన్ని గుత్తేదారుల పాలయ్యాయని రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు.

మూక మామిడి ప్రాజెక్ట్ మరమ్మతులకు నిధులు కేటాయించి సుందరీకరణ చేసి పర్యాటక ప్రాంతంగా ప్రాజెక్టును తీర్చిదిద్దాలని కోరారు. ప్రాజెక్టులో పేరుకుపోయిన పూడికను తీయించి రైతులకు సాగునీటి కష్టాలు లేకుండా చూడాలని సూచించారు. సీతారామ ప్రాజెక్ట్ కెనాల్నుంచి మూకమామిడి ప్రాజెక్టుకు కాలువ నిర్మించి ఆయకట్టు రైతులకు సాగునీరు అందించకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతాంగాన్ని సమీకరించి దశలవారీగా పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య, అన్నవరపు సత్యనారాయణ, సిపిఎం మండల నాయకులు నిమ్మల మధు, మంచాల సారయ్య, గడ్డం సూర్యనారాయణ, పొట్ట రమేష్, భూక్య వెంకటేశ్వర్లు, ఊకే లక్ష్మి,ఓరుగంటి నరేష్, కొరసా వెంకటేశ్వర్లు, మంచాల ఉపేందర్, తానం అంజలి తదితరులు పాల్గొన్నారు