calender_icon.png 13 August, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖజానా జ్యువెలరీలో దొంగల ముఠా కాల్పులు

13-08-2025 01:34:30 AM

-షాపు తెరిచిన ఐదు నిమిషాలకే తుపాకులతో చొరబడ్డ ఆరుగురు దుండగులు 

-ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు..

- ముందుగా సీసీటీవీ కెమెరాలపై కాల్పులు 

- లాకర్ తాళాలు ఇవ్వాలని మేనేజర్‌పై కాల్పులు

- అందిన వస్తువులు దోచుకుని జహీరాబాద్ వైపు పరార్

శేరిలింగంపల్లి, ఆగస్టు 12: చందానగర్‌లోని ఖజానా జ్యువెలర్స్ షోరూంలో మంగ ళవారం ఉదయం దోపిడీ దొంగలు చొరబడి, కాల్పులు జరిపారు. అత్యంత రద్దీగా ఉండే చందానగర్‌లో ఆరుగురు దుండగులు బైక్‌లపై వచ్చి, తుపాకులతో ఖజానా జ్యువెలర్స్ షోరూంలోకి చొరబడ్డారు. షాపు తెరిచిన ఐదు నిమిషాలకే ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజులు ధరించి తుపాకులతో దుండగులు చొరబడ్డారు. ముందు గా సీసీటీవీ కెమెరాలపై కాల్పులు జరిపారు.

అనంతరం లాకర్ తాళాలు ఇవ్వాలని అసిస్టెంట్ మేనేజర్ సతీస్‌కుమార్‌ను బెదిరిం చారు. ఆయన నిరాకరించడంతో కాల్పులు జరిపి, కాలికి గాయపరిచారు. భయంతో షాపు సిబ్బంది, కస్టమర్లు పరుగులు తీశారు. దుండగులు అందిన వస్తువులు దోచుకుని, బైక్‌లపై జహీరాబాద్ వైపు పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ప్రత్యేక బృందాలతో దర్యాప్తు: సీపీ అవినాష్

సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి మాట్లాడుతూ.. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మంగళవారం ఉదయం 10:35 గంటలకు బైక్‌లపై వచ్చిన ఆరుగురు నిందితులు.. మాస్క్‌లు ధరించి షాప్‌లోకి చొరబడ్డారని తెలిపారు. అందులో ముగ్గురి వద్ద తుపాకులు ఉన్నట్లు తెలిపారు. 10:35 గంటల నుంచి 10:45 నిమిషాల వరకు నిందితులు షాప్‌లోనే ఉన్నారని తెలిపారు.

నిందితులు షాప్‌లో కేవలం 10 నిమిషాలు మాత్రమే ఉన్నారని, దొరికిన వెండి వస్తువులను దోచుకెళ్లారని, ఎంత మొత్తంలో చోరీ జరిగింది అనేది ఇంకా స్పష్టత లేదన్నారు. ఘటన స్థలంలో రెండు ఖాళీ క్యాట్రిడ్జ్‌లు దొరికాయని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు 6 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, చుట్టుప్రక్కల జిల్లాల పోలీసులను, టోల్ గేట్ల వద్ద కూడా ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టామని వెల్లడించారు.