calender_icon.png 13 August, 2025 | 2:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధి హామీ నిధుల అవకతవకలపై ఫిర్యాదుల పర్వం

13-08-2025 12:00:00 AM

-15 రోజుల క్రితం గ్రామ పంచాయతీ ముందు గ్రామస్తుల ఆందోళన

-ఇటీవలే ఎమ్మెల్యే, కలెక్టర్, పీడీ లకు వినతి పత్రం.

-తాజాగా గ్రీవెన్స్ సెల్‌లో ఆధారాలతో అడిషనల్ కలెక్టర్ ఫిర్యాదు

చిట్యాల, ఆగస్టు 12(విజయ క్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం గుంటూరుపల్లి జిపి పరిధిలో జరిగిన ఉపాధి హామీ నిధుల అవకతవకలపై వరుస ఫిర్యాదులు కొనసాగుతున్నాయి. కూలీలకు తెలియకుండా జమ చేయబడిన నిధులను ఆ ఊరి మాజీ ప్రజా ప్రతినిధి తమ సొంత బ్యాంకు ఖాతాకు మళ్లించుకున్నాడని ఆరోపిస్తూ జిపి ముందు నిరసన వ్యక్తం చేశారు.వారం రోజుల అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, పీడీలకు తిరిగి విచారణ జరిపించాలని వినతి పత్రాన్ని అందజేశారు.

తాజాగా గుంటూరు పల్లి ఉపాధి హామీ నిధుల పై జరిగిన అవకతవకలపై పూర్తి ఆధారాలతో సహా సోమవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని గ్రీవెన్స్ సెల్ లో జడ్పీ సీఈవో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి కి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఆమె పది రోజుల్లో గ్రామసభ నిర్వహించి తిరిగి సోషల్ ఆడిట్ చేయిస్తానని హామీ ఇచ్చారని గ్రామస్తులు తెలిపారు అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ 2021 నుండి 24 వరకు ఐదు సంవత్సరాలకు సంబంధించిన ఉపాధి హామీ పథకంలో అప్పటి సర్పంచి మాజీ ప్రజా ప్రతినిదులు అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజల సొమ్మును అప్పనంగా కాజేశారని వారు ఆరోపించారు.

గ్రామంలో అనేక రకాలుగా జరిగిన పనుల నిధులను మాజీ ప్రజాప్రతినిధి స్వాహా చేశాడని గ్రామస్తుల కూలీలు ముక్తకంఠంతో అనేక సందర్భాల్లో అధికారులకు చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల ఆంతర్యమేమిటి అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని కూలీలు పనిచేయకున్నా ఖాతాల్లో నిధులను జమ అయ్యేవిధంగా ఆ ప్రజా ప్రతినిధి తప్పుడు ఖాతాలను సృష్టించి తమ డబ్బులు కాజేసాడని ప్రజలు కూలీలు ఆరోపిస్తున్నారు.

గ్రామానికి మంజూరైన ఇంకుడు గుంతలు, నర్సరీ ఎంఎన్‌ఆర్‌ఇజిఎస్ కింద ప్రతి పనిని డమ్మీ ఖాతా పేర్లను సృష్టించి ప్రజల ఖాతాలో నుంచి తన బంధువులు,కుటుంబ సభ్యులు సర్పంచి,సర్పంచి భర్త తండ్రి,అత్తమామల ఖాతా పేరులకు తరలించుకొని సుమారు 40 లక్షలు కాజేశాడని గ్రామస్తులు ఆరోపించిన అధికారుల్లో చలనం లేదని పేర్కొన్నారు.కూలీలకు న్యాయం జరగాలని జిల్లా కేంద్రానికి సైతం వెళ్లి కలెక్టర్ కు, ఎమ్మెల్యేకు ,పీడికి ఫిర్యాదు చేశామని అయినప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో సోమవారం గ్రీవెన్స్ సెల్లో అడిషనల్ కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

ఆ మాజీ ప్రజా ప్రతినిధి డబ్బులను అక్రమంగా కాజేయడం కోసం వివిధ జిల్లాలలో, దేశాలలో ఉన్నవారి పేర్లతో బ్యాంకు ఖాతాలు సృష్టించి ఉపాధిహామీ పనులకు రాకుండా మొరం పోసినట్లు బృహత్ పల్లె పకృతి వనానికి పని చేసినట్లు తెలంగాణ క్రీడా ప్రాంగణానికి పనులు చేసినట్లు వేలు లక్షల రూపాయల్లో వారి అకౌంట్లో సైతం నిధులు మళ్లించినట్లు తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని తెలిపారు.

తాము ఏ చర్చ కైనా సిద్ధమేనని విచారణ చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలంటే తమ గ్రామంలోనే గ్రామ సభ ఏర్పాటు చేసి సోషల్ ఆడిట్ చేయాలని అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. స్పందించిన అధికారులు అతి త్వరలో గ్రామంలో సోషల్ ఆడిట్ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నట్లు తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టని యెడల ఎక్కడిదాకైనా తాము వెళ్లడానికి సిద్ధమని మన్నెం శ్రీనివాస్ రావు,సదా శివరావు, పువ్వాటి హరికృష్ణ, మెట్టు శేషగిరి రావు,శివ రామకృష్ణ, ముద్దన నాగరాజు, శ్రీనివాస్, శ్రీకాంత్, ధనుష్, పువ్వాటి హరికృష్ణ,సతీష్ తదితరులు తెలిపారు.