20-11-2025 12:00:00 AM
ఢిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న ఎన్‌ఐఏ
పాటియాలా కోర్టుకు తరలింపు
యూఎస్‌ఏలో దోపిడీ ముఠా నడుపుతున్న అన్మోల్
అతనిపై రూ.10 లక్షల రివార్డు
న్యూఢిల్లీ, నవంబర్ 19: ఎన్‌సీపీ నాయకుడు, పలుకేసుల్లో మోస్ట్ వాంటెడ్ అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా నుంచి భారతదేశానికి తీసుకొచ్చారు. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, ఎన్‌సీపీ నాయకుడు బాబాసిద్ధిఖీ హత్యలో ప్రధాన నింది తుడు అన్మోల్ బిష్ణోయ్‌ను అమెరికా నుంచి బహిష్కరించారు. అతిడితోపాటు మరో 199 మందిని డిపోర్ట్ చేశారు. వీరిని తరలిస్తున్న విమానం బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండైందని అధికారులు వెల్లడించారు.
విమానం ఢిల్లీలో దిగిన వెంటనే ఎన్‌ఐఏ అన్మోల్‌ను అరెస్టు చేసింది. లారెన్స్ బిష్టోయ్ సిండికేట్ నుంచి మొత్తం 19 మంది అరెస్ట్ అయినట్టు సమాచారం. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడు, మహారాష్ట్ర మాజీమంత్రి బాబా సిద్ధిఖీ హత్యలో నిందితుడు అన్మోల్ బిష్ణోయ్ ను అమెరికా నుంచి బహిష్కరించిన తర్వాత భారత్‌కు తీసుకొచ్చా రు.
అన్మోల్‌ను ఎన్‌ఐఏ అధికారికంగా అరెస్టు చేసిన తర్వాత ఢిల్లీలోని పాటియాలా హౌస్ కోర్టుకు తరలించారు. గతేడాది ఏప్రిల్‌లో నటుడు సల్మాన్‌ఖాన్ ఇంటి వద్ద కాల్పుల ఘటనకు బాధ్యత వహిస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో ముంబై పోలీసులు అతిడిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. బాబాసిద్దిఖీ హత్యకేసు నిందితులతోనూ సన్నిహితంగా ఉన్నాడు. లారెన్స్ బిష్ణోయ్ తమ్ముడిపై దేశవ్యాప్తంగా దాదాపు 18 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
అనేక కేసుల్లో మోస్ట్ వాంటెడ్
2022లో పంజాబీ గాయకుడు సిద్ధూ మూస్ వాలాహత్య, 2024లో ఎన్‌సీపీ నేత బాబా సిద్ధిక్ హత్య, సల్మాన్ ఖాన్ ముంబై నివాసం వెలుపల జరిగిన కాల్పుల్లో అతని పాత్రపై ఎన్‌ఐఏ ఏజెన్సీలు దృష్టి సారించాయి.
మూస్ వాలా, అలియాస్ శుభదీప్ సింగ్ సిద్ధు, మాన్సాలో తన కారులో ఉండగా కాల్చి చంపేశారు. సిద్ధిక్ (66) తన ఎమ్మెల్యే కొడుకు కార్యాలయం వెలుపల ముగ్గురు దుండగుల కాల్పు ల్లో హత్యకు గురయ్యాడు. రాజస్థాన్‌లో కృష్ణజింకను చంపడంలో నటు డు ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బిష్ణోయ్ ముఠా అతనిపై పగ పెంచుకుంది. 2022లో మూస్ వాలా హత్య తర్వాత అన్మోల్ నకిలీ పాస్పోర్ట్‌తో పారిపోయాడని అనుమానిస్తున్నారు.
గత ఏడాదిలో అమెరికాలో అరెస్టు అయ్యాడు. అతని ఆశ్రయం దరఖాస్తు ను గత వారం కోర్టు తిరస్కరించిం ది.
2023లో ఎన్‌ఐఏ అతనిపై చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత, గతేడాది జనవరిలో అన్మోల్‌ను అప్పగించాలని భారత్ అధికారికంగా అభ్యర్థించింది. ఈ నేపథ్యంలో అన్మోల్‌ను అమెరికా బహిష్కరించింది.
2020, 2023 మధ్య ఉగ్రవాద సంబంధిత కార్యకలాపాల్లో అతను మరో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్, లారెన్స్ బిష్ణోయ్‌కి సహాయం చేశాడని ఎన్‌ఐఏ ఆరోపించింది. అతనిపై ఎన్‌ఐఏ రూ.10 లక్షల రివార్డు ప్రకటించింది. అమెరికాలో, అన్మోల్ తన సోదరుడు లారెన్స్ కోసం ముఖ్యమైన కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నాడు. ముఠా కార్యకర్తలకు దాక్కునే ప్రదేశాలు, ఆ యుధాలు అందించేవాడని, అన్మోల్ అక్కడి నుంచే దోపిడీ రాకెట్ ను నడుపేవాడని అధికారులు తెలిపారు.