18-10-2025 12:00:00 AM
మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
చేవెళ్ల, అక్టోబర్ 17 ః స్థానిక పోరుకు సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి బీఆర్ ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం హైదరాబాద్ లో ఆమె నివాసంలో డీసీఎంఎస్ చైర్మన్ పట్లొళ్ల కృష్టారెడ్డి సమక్షంలో చేవెళ్ల మండలం ఆలూరు మాజీ సర్పంచ్ విజయ లక్ష్మీ నర్సిములు తన అనుచరులతో కలిసి గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల పేరిట ఇన్నాళ్లు డ్రామాలు చేసిందని, హైకోర్టు, సుప్రీం కోర్టు మొట్టికాయలు వేయడమే ఇందుకు నిదర్శనమని విమర్శించారు.
ఏ క్షణమైనా రీ షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని, ఈ మేరకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాలోని అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీలతో పాటు సర్పంచ్ స్థానాల్లోనూ గులాబీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు.
కష్టపడి పనిచేసే కార్యకర్తలకు పార్టీలో సముచిత గుర్తింపు ఉంటుందని, ఎలాంటి కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ అభ్యర్థి శేరి స్వర్ణలత దర్శన్, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ గోనె కరుణాకర్ రెడ్డి, మాజీ ఉప సర్పంచ్ కసిరె వెంకటేశ్, చేవెళ్ల టౌన్ ప్రెసిడెంట్ తోట శేఖర్, మాజీ వార్డు మెంబర్ హైమద్ తదితరులు పాల్గొన్నారు.