calender_icon.png 19 November, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘంటసాల ది గ్రేట్.. భావోద్వేగభరిత చిత్రం

16-11-2025 12:00:00 AM

ఘంటసాల వేంకటేశ్వరరావు జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ‘ఘంటసాల ది గ్రేట్’ అనే చిత్రాన్ని అన్యుక్త్ రామ్ పిక్చర్స్ సమర్పణలో సీహెచ్ ఫణి నిర్మిస్తున్నారు. సీహెచ్ రామారావు రచన, దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కృష్ణచైతన్య ఘంటసాలగా, మృదుల ఘంటసాల సావిత్రమ్మ గా, చిన్న ఘంటసాలగా తులసి మూవీ ఫేమ్ అతులిత నటించగా.. సుమన్ ముఖ్య పాత్రను పోషించారు.

ఈ చిత్రాన్ని డిసెంబర్ 12న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో శనివారం ఈ సినిమా టీజర్‌ను ముఖ్యఅతిథిగా హాజరైన డైరెక్టర్ ఆదిత్య హాసన్ లాంఛ్ చేశారు. అనంతరం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “నాకు ఇండస్ట్రీలో అశోక్ దయ్యాల అనే మిత్రుడి ద్వారా బాలాజీ, రామారావుల వద్ద పనిచేసే అవకాశం వచ్చింది. రామారావు వద్ద కేవలం పన్నెండు రోజులే పనిచేశా. ఆ తర్వాత ఫారిన్ వెళ్లా.

మళ్లీ వచ్చి సొంతంగా దర్శకుడిగా పనిచేస్తున్నా. ‘ఘంటసాల’ స్క్రిప్ట్ ఎంతో భావోద్వేగభరితంగా ఉంటుంది. ప్రతిఒక్కరూ చూడండి. ఈ చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా” అన్నారు. హీరో కృష్ణచైతన్య మాట్లాడుతూ.. “ఈ చిత్రంలో ఘంటసాల పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నా. ఓ గాయకుడినైన నేను ఆయన పాటలు వింటూ పెరిగి, ఇప్పుడిలా ఆయన జీవిత చరిత్రను చెప్పే క్రమంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది” అన్నారు.

దర్శకుడు రామారావు మాట్లాడుతూ.. “సింగర్‌గా కంటే ఘంటసాల వ్యక్తిత్వం గురించి అందరికీ తెలియాలని ఈ సినిమాను తీశాను. ఘంటసాల పాత్ర పోషించాలని చాలా మంది స్టార్స్‌ను అడిగా. ఈ సినిమా బయటకు రాకుండా చేయాలని కొంత మంది ప్రయత్నిస్తున్నారు. ఎన్ని శక్తులు అడ్డు పడినా డిసెంబర్ 12న ఈ సినిమాను రిలీజ్ చేస్తా” అన్నారు. కార్యక్రమంలో రామసత్య నారాయణరాజు, శోభారాణి, కర్రి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.