calender_icon.png 26 August, 2025 | 7:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీహెచ్‌ఎంసీ ‘తీగ’ కట్.. ఆర్టీఏ సేవలు ఫట్!

26-08-2025 12:18:00 AM

మణికొండ,ఆగస్టు 25:నగర సుందరీకరణ, భద్రత కోసం జీహెచ్‌ఎంసీ చేపట్టిన చర్యలు మణికొండ రవాణా శాఖ కార్యాలయంలో సేవలకు తీవ్ర అంతరాయం కలిగించాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యుత్ స్తంభాలకు అడ్డదిడ్డంగా ఉన్న కేబుల్, ఇంటర్నెట్ వైర్లను తొలగించే క్రమంలో ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లే ఇంటర్నెట్ లైన్లను సిబ్బంది తొలగించారు.

దీంతో ఒక్కసారిగా కార్యాలయంలో ఆన్లైన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. సోమవారం ఉదయం స్లాట్లు బుక్ చేసుకుని రిజిస్ట్రేషన్లు, లెర్నింగ్ లైసెన్సులు, ఇతర పనుల కోసం వందలాది మంది దరఖాస్తుదారులు కార్యాలయానికి చేరుకున్నారు. అయితే, సర్వర్లు పనిచేయకపోవడంతో గంటల తరబడి పడిగాపులు కాయాల్సి వచ్చింది.

ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వేచి చూసినా సేవలు పునరుద్ధరణ కాకపోవడంతో తీవ్ర నిరాశతో వెనుదిరిగారు. ఈ సమస్యపై అధికారులను వివరణ కోరగా జీహెచ్‌ఎంసీ చర్యల వల్ల ఇంటర్నెట్ నిలిచిపోయిన మాట వాస్తవమేనని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం నుంచి సేవలను యథావిధిగా పునరుద్ధరిస్తామని వారుస్పష్టంచేశారు.