15-10-2025 01:03:21 AM
ఇద్దరి యువకులు అరెస్టు.. పోక్సో కేసు నమోదు
కరీంనగర్ క్రైం, అక్టోబరు 14 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలోని కొత్తపల్లి మండలంలో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పెట్టారు. ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొత్తపల్లి మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలికతో విశ్వతేజ్, సన్నీ అనే ఇద్దరు యువకులు కొద్దిరోజులుగా సన్నిహితంగా ఉంటూ, ఆమెకు మత్తుమందు అలవాటు చేశారు.
ఈ క్రమంలోనే వారం రోజుల క్రితం నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఒకరి తర్వాత ఒకరు లైంగిక దాడికి పాల్పడ్డారు. లైంగిక దాడి సమయంలో వీడియో తీశారు. మూడు రోజుల క్రితం ఈ వీడియోలను స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేశారు. విషయం తెలియడంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏసీపీ విజయ్‌కుమార్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సీఐ బిల్లా కోటేశ్వర్.. లైంగిక దాడికి పాల్పడిన విశ్వతేజ్, సన్నీలపై పోక్సో కేసు నమోదు చేశారు. సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మంత్రాల నెపంతో బాలికపై లైంగిక దాడి
ఆదిలాబాద్ (విజయక్రాంతి): మంత్రాల నెపంతో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నకిలీ బాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఆదిలాబాద్ వన్ టౌన్ సీఐ సునీల్‌కుమార్ వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్‌కు చెందిన బాలిక తరచూ అనారోగ్యానికి గురవ్వడంతో.. తన స్నేహితురాలి తండ్రి అయిన గాదిగూడకు చెందిన షేక్ కలీం మంత్రాలు, తాయిత్తులతో నయం చేస్తానని నమ్మబలికాడు.
బాధితురాలితో సహా వారి కుటుంబీకులను ఈ నెల 9న నిర్మల్ జిల్లా సోన్‌లోని గోదావరి నది సమీపంలో పూజలు చేయించాడు. తిరిగి 11న బాధితురాలి స్వగృహానికి తీసుకువచ్చారు. అదే రోజు రాత్రి నిందితుడు బాధి తురాలి ఇంట్లో బస చేసి పూర్తిగా నయం కావాలంటే ఈరోజు రాత్రి ఒంటరిగా బాధితురాలితో పలు పూజా కార్యక్రమాలు చేయాలని నమ్మబలికి, కుటుంబీకులను వేరే గదిలో ఉంచాడు.
రాత్రి సమయంలో బాధితురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. నిందితుడు వెళ్లిన మరుసటి రోజు ఉదయం బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో కుటుంబీకులు ఆదిలాబాద్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. నిందితుడు షేక్ కలీంపై పోక్సో కేసు నమోదు చేసి, అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.