15-10-2025 02:53:51 PM
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
చిట్యాల,(విజయక్రాంతి): ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోయారని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు. బుధవారం రామన్నపేట మండల కేంద్రంలోనీ పిఎసిఎస్ సెంటర్ లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించి, అకాల వర్షం కారణంగా నష్టపోయిన రైతులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి కారణంగానే రైతులు తీవ్రంగా నష్టపోయారని, జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా రైతులకు కావాల్సిన కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలేని స్థితిలో ఉన్నారని, ముఖ్యమంత్రికి రాజకీయాలు తప్ప రైతుల బాధలు పట్టించుకునే పరిస్థితిలో లేడని విమర్శించారు.
కేసీఆర్ హయంలో సీజన్ మొదలయ్యేకంటే ముందే కావలసిన వనరులు సమకూర్చే వాళ్ళమని, అధికారులు, మిల్లర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి కొనుగోలులో లోపాలు లేకుండా చూసేవాళ్ళమని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మద్దతు ధర ఇవ్వకుండా రైతులను నష్టపోయేలా చేస్తున్నారని, కాంగ్రెస్ నాయకుల కమీషన్ల పేరుతో మిల్లర్లు రైతుల నుండి దోచుకుంటున్నారని, కాంగ్రెస్ నాయకులు దళారులతో చేతులు కలిపి రైతుల నుండి దారుణంగా దోచుకుతింటున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు, మంత్రులకు ముడుపులు ముడితే చాలు అన్నచందంగా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వ తీరుఅని, ప్రభుత్వం 2300 మద్దతు ధర ఇస్తే మిల్లర్లు మాత్రం రైతులకు 1500 ఇస్తున్నా మిల్లర్లను ఎందుకు ప్రభుత్వం హెచ్చరించడం లేదు...? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి హయాంలో వ్యవసాయం దండగ అనే పరిస్థితి రాష్ట్రంలో దాపురించిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులను నట్టేట ముంచారని, కాంగ్రెస్ ప్రభుత్వం షరతులు లేకుండా రైతు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చెయ్యాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కమీషన్లు, దోచుకుతినడం తప్పా కాంగ్రెస్ నాయకులకు ఇంకో సోయి లేదని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక అభివృధి కుంటుపడిందని మండిపడ్డారు.