15-10-2025 02:44:49 PM
ఓటర్ జాబితాలో తప్పులుంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణం
హైదరాబాద్: మొన్నటివరకు అధికారంలో ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Sridhar Babu) అన్నారు. ఓటరు జాబితాలో తప్పులుంటే బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమని మంత్రి శ్రీధర్ బాబు ఆరోపించారు. కాంగ్రెస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్(Naveen Yadav) బస్తీవాసులకు అందుబాటులో ఉంటారని శ్రీధర్ బాబు(Sridhar Babu) వెల్లడించారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరని శ్రీధర్ బాబు తేల్చిచెప్పారు. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ పార్టీ దొంగ ఓట్ల నమోదు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. 2023 ఎన్నికల నుండి 2025 నాటికి 23 వేల ఓట్లు పెరిగినట్లు ఎన్నికల కమిషన్ చెబుతున్నదని, రెండేళ్లు కూడా తిరగకుండా 23 వేల ఓట్లు ఎలా పెరిగాయని మాకు అనుమానం వచ్చి ఎంక్వయిరీ చేసామని కేటీఆర్ స్పష్టం చేశారు.
సెప్టెంబర్ 2న ఒకే రోజు 12 వేలకు పైగా దొంగ ఓట్లను నమోదు చేశారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే, జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి వల్లాల నవీన్ యాదవ్ 2025 అక్టోబర్ 17 శుక్రవారం ఉదయం 11 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నారని కాంగ్రెస్ పార్టీ తెలిపింది. కాగా, బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత బుధవారం నాడు షేక్ పేట తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. నిన్నటి వరకు ఉత్కంఠ రేపిన బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిపై నేడు తెరపడింది. బీజేపీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల బరిలో అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డిని బీజేపీ అధిష్ఠానం బరిలోకి దింపింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉంటుందని బీజేపీ నేతలు అంటున్నారు.